ఏపీలో తెలుగు సినిమాకు కష్టాలకు ఇక చెల్లు… ఇక అన్నీ మంచి రోజులే!

  • June 5, 2024 / 12:06 PM IST

భారీ బడ్జెట్ పెట్టి తీసే సినిమాలను బాగా మార్కెటింగ్‌ చేసుకుందామంటే ఆంక్షల, రూల్స్‌. పెద్ద సినిమాల విడుదల సమయంలో ఒక అదనపు షో కావాలంటే దానికి ఏవేవో రూల్స్‌. థియేటర్లలో సినిమా ఆడిద్దాం అనుకుంటే.. టికెట్‌ రేటు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి ధరల పట్టికలో పెట్టి బలవంతం. ప్రభుత్వ అధికారులను థియేటర్ల దగ్గర పెట్టి సినిమాలు వేయించాలనే ప్రయత్నం. టికెట్లను తాము చెప్పిన వెబ్‌సైట్‌లోనే కొనాలి, అమ్మాలి.. డబ్బులు మేం తర్వాత మీకు ఇస్తాం అని థియేటర్లకు హకుం.

గత ఐదేళ్లలో ఇలాంటివి చాలానే చూశాం. సగటు సినిమా ప్రేక్షకుడు, దర్శకుడు, నిర్మాతలు, హీరోలు.. ఇలా ఒక్కరేంటి గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు. చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్‌ హీరో సీఎం దగ్గరకు వెళ్లి చేతులు జోడించి మా మీద కాస్త దయ చూపించండి అని రిక్వెస్ట్‌ చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు షటిల్‌ సర్వీసులు హైదరాబాద్‌ టు విజయవాడ షటిల్‌ సర్వీసుల్లా తిరిగారు.

అయితే ఇప్పుడు వాళ్లంతా తద్వారా తెలుగు సినిమా ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఎందుకంటే తిరిగి సినిమా పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం కాబోతున్నారు. చేతనైతే సాయం చేయాలి, లేదంటే గమ్మునుండాలి. ఈ మాటను పట్టించుకోని గత ప్రభుత్వం ఎలాంటి కష్టాలు పెట్టిందో మీరూ చూసే ఉంటారు. ఈ క్రమంలో చాలామంది దర్శకులు, నిర్మాతలు, నటులు బహిరంగంగానే విమర్శించారు.

వాటిని తిరిగి తమ సోషల్‌ మీడియా సైన్యంతో గత ప్రభుత్వం ట్రోల్‌ చేయించింది. అలా అని ఏమైనా మంచి చేశారా, చేయాలనే ఆలోచన చేశారా అంటే అదీ లేదు. దీంతో ఈ ఎన్నికలకు ముందు ‘ఏపీలో ఏమవుతుంది’ అంటూ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా చూడటం ప్రారంభించారు. ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం గతంలో సినిమాకు బాసటగా నిలిచిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ అలాంటి రోజులు మళ్లీ రావాలని ఆశిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus