Good Luck Sakhi Review: గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

పలు ఫారిన్ & బాలీవుడ్ సినిమాలను రూపొందించి దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సంపాదించుకున్న తెలుగువాడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా “గుడ్ లక్ సఖి”. కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జనవరి 28) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా కీర్తిసురేష్ విజయాన్ని అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: ఓ కుగ్రామంలోని సాధారణ యువతి సఖి (కీర్తిసురేష్). తను ఊర్లో ఉండడమే దురదృష్టమని భావిస్తుంటారు ఊర్లో జనాలందరూ. అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది సఖి. ఆమెలోని టాలెంట్ ను గుర్తించిన ఏకైక వ్యక్తి రాజు (ఆది పినిశెట్టి). ఆమెతో సన్నిహితంగా ఉంటూనే ఆమెను ఎంకరేజ్ చేస్తుంటాడు. అదే ఊర్లో షూటింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు కల్నల్ (జగపతిబాబు). సఖి బ్యాడ్ లక్ తొలుత కల్నల్ & రాజులను ఇబ్బందిపెట్టినా.. తర్వాత ఆమె ప్రతిభను యావత్ భారతదేశం గుర్తించే స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో సదరు బృందం ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “గుడ్ లక్ సఖి” కథాంశం.

నటీనటుల పనితీరు: పూరి జగన్నాధ్ తర్వాత నగేష్ కుకునూర్ మాత్రమే రమాప్రభను నటిగా పూర్తిస్థాయిలో వినియోగించుకోగలిగాడు. పరభాషా నటుల కోసం పరితపిస్తూ మన ప్రాంతీయ నటుల్ని ఎంత అశ్రద్ధ చేస్తున్నామో గుర్తుచేశాడు నగేష్. సినిమాలోని మిగతా పాత్రధారులందరినీ తన స్క్రీన్ ప్రెజన్స్ తో డామినేట్ చేసేసారు రమాప్రభ. ఆమె తర్వాత చక్కని నటన కనబరిచింది జగపతిబాబు. కల్నల్ గా ఆయన పాత్రకు ఒక జస్టిఫికేషన్ లేకపోయినప్పటికీ.. నటుడిగా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసాడు. రంగస్థల నటుడిగా ఆది పినిశెట్టి పాత్ర బాగుంది. బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే క్యారెక్టర్ కి ఇంకాస్త మంచి ఎలివేషన్ ఉండేది.

ఇక టైటిల్ పాత్రధారిణి మరియు హీరోయిన్ అయిన కీర్తిసురేష్ హావభావాల ప్రకటనలో వెనుకబడింది. దర్శకుడు ఆమె నుండి సరైన నటన రాబట్టుకోలేకపోయాడా లేక పాత్ర తీరుతెన్నులను నటిగా కీర్తి పూర్తిస్థాయిలో అర్ధం చేసుకోలేకపోయిందా అనేది అర్ధం కాని ప్రశ్న. నటిగా కీర్తి వీక్ పెర్ఫార్మెన్స్ లలో ఈ చిత్రమొకటి. రాహుల్ రామకృష్ణను ఇంకాస్త చక్కగా వినియోగించుకొని ఉండొచ్చు. అతడి పాత్రకు ఉన్న డెప్త్ కి, అతడి చెప్పే డైలాగ్స్ కి సంబంధం ఉండదు.

సాంకేతికవర్గం పనితీరు: సింక్ సౌండ్ తో సినిమాను తెరకెక్కించడం అనేది చాలా నేర్పుతో చేయాల్సిన పని. గత ఐదారేళ్లలో “పెళ్లిచూపులు” మాత్రమే సింక్ సౌండ్ తో పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమా. అలాంటిది “గుడ్ లక్ సఖి”ని సింక్ సౌండ్ తో తీశారో లేక డబ్బింగ్ చెప్పించడం మర్చిపోయారో తెలియదు కానీ.. థియేటర్ మొత్తం ప్రశాంతంగా ఉన్నా సగానికి పైగా డైలాగులు అర్ధం కావు, ఇంకొన్ని వినబడవు. అప్పట్లో “తీన్ మార్” సినిమా చూసినప్పుడు కలిగిన భావనను మళ్ళీ “గుడ్ లక్ సఖి” రిపీట్ చేసింది. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన బృందం సినిమాకి చాలా ముఖ్యమైన ఈ సౌండ్ ను పట్టించుకోకపోవడం బిగ్గెస్ట్ మైనస్.

దర్శకుడు నగేష్ కుకునూర్ తన తెలుగు డెబ్యూకి పూర్తిస్థాయిలో ప్రిపేర్ అవ్వలేదనిపించింది. అతడి మునుపటి చిత్రం “దనక్”లో హృదయం ఉంటుంది. ఈ సినిమాలో కనీసం సరైన కథనం కూడా లేదు. అసలు జగపతిబాబు ఇదే ఊర్లో షూటింగ్ ట్రైనింగ్ క్యాంప్ ఎందుకు పెడతాడు? సఖికి షూటింగ్ ఎలా అలవాటైంది? వంటి బేసిక్ లాజిక్స్ కు ఆన్సర్స్ లేవు. అలాగే.. రెండు గంటల నిడివి సినిమా కూడా బోర్ కొట్టిందంటే దర్శకుడిగా మాత్రమే కాదు కథకుడిగానూ నగేష్ విఫలమయ్యాడని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమా మొత్తానికి కాస్త ఆకట్టుకున్న అంశాలు ఈ రెండు మాత్రమే.

విశ్లేషణ: “మహానటి”తర్వాత కీర్తి హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నది లేదు. ఈమధ్యలో ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాప్స్ అనే చెప్పాలి. ఆఖరికి ఈ “గుడ్ లక్ సఖి” కూడా ఆమెకు అదృష్టాన్ని తీసుకురాలేకపోయింది. ఈ సినిమా చూడాలంటే ప్రేక్షకులకు గుడ్ లక్ మాత్రమే కాదు ఓపిక, సహనం, సమయం లాంటివి మెండుగా ఉండాలి. దర్శకుడిగా నగేష్ ప్రతిభకు ఈ చిత్రం తార్కాణం మాత్రం కాదనే విషయాన్ని ప్రేక్షకులు గుర్తించాలి.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus