ఒకప్పుడు వచ్చిన సినిమాలు ఇప్పుడు రావడం లేదు! ఈ మాటలు మనం చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. ఎవరైనా ఇలా అంటున్నారు అంటే అవి సగటు సినిమాల గురించి కాదు. ప్రజా సమస్యలను వెండితెరపై చూపించే సినిమాల గురించి అని అర్థం. కొన్నేళ్ల క్రితం ఇలాంటి సినిమాల కోసం ఏకంగా ప్రత్యేక దర్శకులే ఉండేవారు. ఇటీవల కాలంలో అలాంటి దర్శకుడు, నటుడు అంటే ఆర్.నారాయణమూర్తే. అయితే గతంలో టి.కృష్ణ ఇలాంటి సినిమాలు చేసేవారు.
ఈ విషయాన్ని ఇటీవల ఆయన తనయుడు, కథానాయకుడు (Gopichand) గోపీచంద్ దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అలాగే నేటితరం దర్శకుల గురించి షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. అలాగే మీరు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం తగ్గించేశారా అని అడిగితే… అలాంటి కథలు వస్తే కచ్చితంగా చేస్తాను. కొన్ని కాన్సెప్ట్‌లు వినడానికి బాగుంటాయి. ఆ కథల్ని అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చి..ఆసక్తికరంగా చెప్పగలిగితే ఓకే. ఒకవేళ కుదరనప్పుడు అలాంటి కథలు ముట్టుకోకపోవడమే మేలు అని అనన్నారు.
మా నాన్న తరం దర్శక రచయితలంతా బయట జనాలతో ఉండేవారు. వాళ్ల జీవితాల్ని, కష్టనష్టాల్ని దగ్గరగా చూశారు. అలా చూసిన జనాల జీవితాల నుంచే కథలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ పాత సినిమాలు, ఇతర భాషల సినిమాలు చూస్తున్నారు. బయట జనాల్ని చదవడం లేదు. సమాజంలోకి వెళితే బోలెడన్ని సమస్యలున్నాయి. వాటిని సినిమా రూపంలో చూపించొచ్చు. అయితే ఆ కథలకు కొన్ని హంగులు అద్ది.. రెండున్నర గంటలు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా చెప్పగలిగే చాలు.
అలాంటి దర్శకులు ఇప్పుడు మన దగ్గర చాలా తక్కువ ఉన్నారు అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్ ప్రస్తుతం ‘భీమా’ (Bhimaa) సినిమాతో సిద్ధంగా ఉన్నారు. మాస్ మసాలా సినిమా అని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. మరి ఏమేరకు థియేటర్లలో ప్రజలకు నచ్చుతుందో చూడాలి. ఈ నెల 8నే ఈ సినిమా విడుదలవుతోంది.