జయాపజయాలను పట్టించుకొంటే సినిమాలు తీయలేం : హను రాఘవపూడి

  • July 8, 2020 / 12:01 PM IST

డైరెక్టర్ పేరు ఓ నాలుగు సినిమాలు చేస్తే అందరూ గుర్తుపెట్టుకొంటారు. కానీ.. సినిమా బట్టి డైరెక్టర్ పేరు గుర్తుపట్టడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి ఘనత సొంతం చేసుకొన్న దర్శకుడు హను రాఘవపూడి. మూస సినిమాల వరదలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి తనదైన శైలి సినిమాలతో ఊపిరిపోసాడు. హను అంటే ఎంతమంది గుర్తుపడతారో తెలియదు కానీ.. “అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమాల దర్శకుడు అంటే గుర్తుపట్టని వారుండరు. ఒక డైరెక్టర్ గా హను సాధించిన ఘనతలో ఇది మొదటిది. ఆయన తీసిన సినిమాలు ఎంత బాగా ఆడాయి అనే పక్కన పెడితే.. సదరు సినిమాలోని పాత్రలను ఆడియన్స్ ఓన్ చేసుకొన్న విధానం మాత్రం ప్రశంసనీయం. అందుకే హను సినిమాకి మిగతా సినిమాలతో పోల్చి చూసినప్పుడు కాస్త వెయిట్ ఉంటుంది. ఆయన సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ సంఖ్య కూడా ఎక్కువే. ఆయన తాజా చిత్రం “లై” గురించి హను చెప్పిన విశేషాలు..!!

ఫస్ట్ రాసుకొన్న క్యారెక్టర్ ఆయనదే..
సినిమా కథ కంటే ముందు విలన్ పాత్రను రెండేళ్ల క్రితం నుంచి డిజైన్ చేస్తున్నాను. “అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమాకి మధ్య రెండేళ్ల గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ లో ఖాళీగా కూర్చోలేక ఈ కథ రాసుకొన్నాను. అయితే.. విలన్ పాత్రను అర్జున్ గారు తప్పితే “పద్మనాభం” అనే పాత్రను ఎవరూ సరిగా పెర్ఫార్మ్ చేయలేరు అని నా ధీమా. అందుకు తగ్గట్లే ఆయన పాత్రకు ప్రాణం పోశారు. ఆయన లేకపోతే.. సినిమాకి ఈ స్థాయి వచ్చేది కాదు. మొదటి పదిరోజులు ఆయన్ని చూసి భయపడుతూనే షూట్ చేశాను, అందుకు కారణం ఆయన సినిమాలు చిన్నప్పట్నుంచి చూస్తూ పెరగడమే.

పాత్ర కాదు పాత్ర స్వభావం స్టైలిష్ గా ఉంటుంది..
సినిమాలో నితిన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడని చాలా మంది నితిన్ ను, అతడ్ని అంత స్టైలిష్ గా చూపించినందుకు నన్ను మెచ్చుకొంటున్నారు. నిజానికి.. నితిన్ క్యారెక్టర్ స్టైలిష్ గా కనిపించడం కాదు అతి పాత్ర స్వభావం అలాంటిది. ఇక నితిన్-మేఘా ఆకాష్ లు అందంగా కనిపించడానికి కారణం నిరజా కోన. ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకొన్న జాగ్రత్తల వల్లే వాళ్ళు అంత అందంగా కనిపిస్తున్నారు.

జోనర్ రిపిటీషన్ నాకు నచ్చదు..
నేను తీసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకొంటాను. అందుకే నేను తీసిన సినిమా జోనర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనుకొనే నా ప్రతి సినిమాకి వేరియేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను.

కెమెరాబ్యూటీ కోసం అక్కడికి వెళ్లలేదు..
ఏదో అమెరికాలో అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయనో అక్కడ షూట్ చేస్తే సినిమా రేంజ్ పెరుగుతుందనో అనుకోని ఈ సినిమా కోసం ఫారిన్ వెళ్లలేదు. కథకి అవసరం కాబట్టి అమెరికా వెళ్ళాం.

70 కోట్ల రూపాయల సినిమా అనుకొంటారు..
మా సినిమా కలరింగ్ మొదలుకొని మేకింగ్, టేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగని భారీగా డబ్బు ఖర్చు చేయలేదు. కథకి ఎంతవరకూ అవసరం నితిన్ మార్కెట్ పరిధిని దృష్టిలో పెట్టుకొనే ఖర్చు పెట్టాం. అలాగని మా నిర్మాతలు కూడా ఎక్కడా కట్టడి చేయలేదు, నన్ను చాలా ఫ్రీగా వదిలేశారు, ఏం కావాలంటే అది ఇచ్చారు.

ఊహించని ట్విస్టులు బోలెడుంటాయి..
“లై” అనేది స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు, ఒక మంచి ప్రేమకథ ఉంది, హీరో-విలన్ మధ్య మంచి కాంఫ్లిక్ట్ పాయింట్ ఉంది, అంతకుమించిన అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంది. వీటన్నింటినీ మించి ఎవరూ ఊహించలేని ట్విస్టులున్నాయి. సో, “లై” అనేది ఆద్యంతం అలరించే స్టైలిష్ మూవీ.

ఆ అబద్ధాల వెనుక ఉన్న నిజమే కథ..
సినిమాలో హీరో పాత్ర హీరోయిన్ కి బోలెడన్ని అబద్ధాలు చెబుతుంది. అయితే.. ప్రతి అబద్ధం వెనుక ఒక నిజం ఉంటుంది, అదే “లై”లో దాగి ఉన్న అసలైన లాజిక్. ఆ లాజిక్ ను ఆడియన్స్ క్యాచ్ చేశారంటే.. సినిమా మొత్తం చాలా సరదాగా ట్రావెల్ అయిపోతారు.

ఒక్కోసారి ఒక్కో షాట్ కష్టంగా ఉంటుంది..
సినిమాలో నేను తీసిన కష్టమైన షాట్ ఏమిటి అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఒక్కోసారి క్లోజ్ షాట్ ఇబ్బంది పెడుతుంది, మరోసారి లాంగ్ షాట్ ఇబ్బందిపెడుతుంది. ఒక్కోసారి ఆర్టిస్ట్ నుండి సరైన ఎక్స్ ప్రెషన్ రాబట్టుకోవడం కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు ఈ షాట్ తీయడానికి ఎక్కువ కష్టపడ్డాను అని పర్టీక్యూలర్ చెప్పలేను.

హిట్టు-ఫ్లాప్ అనే విషయాన్ని నేను పట్టించుకోను..
ఫిలిం మేకింగ్ మీద దృష్టి పెట్టినప్పుడు హిట్-ఫ్లాప్ అనే విషయాన్ని పట్టించుకోకూడదు. అలా పట్టించుకొంటే సినిమాలు తీయలేను. ఇక నాలో ప్లస్ ఏమిటి, మైనస్ ఏమిటి అనే విషయాన్ని ఆడియన్స్ జడ్జ్ చేయాలి, నేను చెప్పలేను.

“అందాల రాక్షసి” మరీ అంత బ్యాడ్ సినిమా కాదు..
నేను తీసిన “అందాల రాక్షసి” కాంటెంపరరీ సినిమా. ఆ సినిమా రిజల్ట్ ను నేను కానీ నా నిర్మాతలు కానీ పట్టించుకోలేదు. అందరూ ఒక్కటే మాట అన్నారు “మరీ అంత బ్యాడ్ మూవీ కాదు” అది చాలు నాకు.

నానీ సినిమాకి స్పెషల్ పర్మిషన్స్ కావాలి..
నానీతో అనుకొన్న మిలటరీ బ్యాక్ డ్రాప్ సినిమా తీయడానికి కొన్ని లొకేషన్స్ లో స్పెషల్ పర్మిషన్స్ కావాలి, ఆ పర్మిషన్స్ దొరకాలి, సినిమా కోసం నానీ బల్క్ డేట్స్ కావాలి. అవన్నీ సెట్ అయితే.. నానీ సినిమా సెట్స్ కు వెళుతుంది. అయితే.. అది వార్ సినిమా మాత్రం కాదు. ఒక సైనికుడి కోణంలో సాగే స్వచ్చమైన ప్రేమకథ. ఆ సినిమాలో ఒక కొత్త నానీని చూస్తారు.

అఖిల్ కోసం అనుకొన్న కథ అలానే ఉంది..
అఖిల్ హీరోగా తెరకెక్కించడం కోసం రాసుకొన్నది చాలా టిపికల్ సబ్జెక్ట్. సినిమా టాక్స్ జరిగాయి కానీ సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఎప్పుడు అనేది నేను చెప్పలేను. ఇక నెక్స్ట్ సినిమా ఏమిటి అనే విషయంలో నాకే ఇంకా క్లారిటీ లేదు. ఒన్స్ ఫిక్స్ అయితే నేనే స్వయంగా మీడియాకి వెల్లడిస్తాను.

– Dheeraj Babu


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus