హరీష్ శంకర్ ను పట్టించుకొనే కథానాయకుడే లేడా?

రవితేజ కెరీర్ లో చివరి బ్లాక్ బస్టర్ హిట్ గా పేర్కొనే “మిరపకాయ్” చిత్రానికి దర్శకత్వం వహించిన ఘనుడు, దాదాపు పదేళ్ళ పాటు “హిట్” అనే పదానికి పది మైళ్ళ దూరంలో ఉండిపోయిన పవన్ కళ్యాణ్ కు ఏకంగా “బ్లాక్ బస్టర్” హిట్ ఇచ్చి పవర్ స్టార్ అభిమానులందరూ జల్సా చేసుకొనేలా చేసిన హరీష్ శంకర్ ఆ తర్వాత “రామయ్య వస్తావయ్య” చిత్రంతో డిజాస్టర్ అందుకొన్నప్పటికీ.. మళ్ళీ “సుబ్రమణ్యం ఫర్ సేల్”తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన “దువ్వాడ జగన్నాధం” రిజల్ట్ ఏమిటనేది ప్రత్యేకించి పేర్కొనాల్సిన అవసరం లేదు.

“డీజే” అనంతరం మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలోనే నితిన్-శర్వానంద్ హీరోలుగా హరీష్ శంకర్ “దాగుడుమూతలు” అనే సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. మొన్నామధ్య దిల్ రాజు ప్రకటించిన తన తదుపరి చిత్రాల విడుదల తేదీల్లో “దాగుడు మూతలు” లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే హరీష్ దానికి సమాధానంగా “నా సినిమా ఆ లిస్ట్ లో లేకపోవడం చాలా బాధగా ఉంది” అని వివరణ ఇచ్చాడు. అయితే.. ఆ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంట్రా అంటే.. “దిల్ రాజుకి ఆ చిత్రాన్ని మల్టీస్టారర్ లా తీయాలని, హరీష్ ఏమో సింగిల్ హీరోతో తీయాలని” ప్లాన్ చేశారట. కానీ.. రెండూ వర్కవుట్ అవ్వకపోవడంతో “దాగుడు మూతలు” తాత్కాలికంగా అటకెక్కింది. తాను ప్లాన్ చేసుకొన్న నితిన్, శర్వానంద్ లు ప్రస్తుతం బిజీ అయిపోవడంతో ఇప్పుడు హరీష్ హీరో కోసం వెతుకులాటలో ఉన్నాడట. మరి హరీష్ కి తన కథకు తగ్గ హీరో ఎప్పుడు దొరుకుతాడు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus