ఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అర్ధరాత్రి నుండి ప్రేక్షకులు, ప్రభాస్ (Prabhas) అభిమానులు సినిమా చూసి ఉప్పొంగిపోతున్నారు. ఏ మాటకు ఆమాట ఇండస్ట్రీ కూడా చాలా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లు నిజమయ్యాయి. అవే సినిమాలో అతిథి పాత్రలు. సినిమా మొదలైంది ఆలస్యం.. అతిథి పాత్రల పుకార్లు చాలానే వచ్చాయి. అందులో చాలావరకు నిజం కాగా.. మరికొంతమంది తళుక్కున మెరిసి షాక్ ఇచ్చారు.
సినిమాలో కనిపించిన అతిథి పాత్రల ఉపయోగం ఏంటి, నిజంగానే ఆ పాత్రలు ఆకట్టుకున్నాయా? అనేది ఇప్పుడు పక్కన పెడదాం. ఎవరెవరు కనిపించారు, ఎలా కనిపించారు అనేది చూస్తే.. పుకార్లు షికార్లు చేసినట్లు, సినిమా టీమ్ అప్పుడప్పుడు చెప్పిన పేర్లు చాలావరకు నిజమే. ముందుగా బయటకు వచ్చిన పుకార్లు చూస్తే.. ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli), రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాలో కనిపించారు. వర్మ ఓ హోటల్ నిర్వాహకుడిగా నటించగా.. రాజమౌళి కార్ల స్పేర్స్‌గా నటించారు.
ఇక సినిమా రిలీజ్ ముందు రోజు టీమ్ చెప్పేసినట్లుగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా సినిమాలో ఉన్నారు. దుల్కర్ ఈ సినిమాలో ప్రభాస్‌ను పెంచి పోషించిన వ్యక్తిగా దుల్కర్ కనిపిస్తాడు. విజయ్ అయితే అభిమన్యుడిలా కనిపిస్తాడు. ఇద్దరిలో విజయ్ ఎక్కువ సేపు కనిపిస్తాడు అని చెప్పాలి. ఇక వీళ్లు కాకుండా ఓ పాటలో ‘జాతి రత్నాలు’ టీమ్ కనిపిస్తుంది. డ్యాన్సర్‌గా ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటించగా.. పాటలో ఓ పార్టీకి వచ్చిన వ్యక్తిగా దర్శకుడు అనుదీప్(Anudeep) కనిపిస్తారు.
సినిమా ప్రారంభంలోనే ఓ గర్భవతిగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), కనిపిస్తుంది. హీరోయిన్ అని చెప్పిన దిశా పటానీ (Disha Patani) కూడా గెస్ట్ యాక్టరే అని చెప్పాలి. ఓ రెండు సీన్లు, పాటకు ఆమెను పరిమితం చేశారు. అయితే గతంలో పుకార్లుగా వినిపించిన నాని (Nani) , ఎన్టీఆర్ (Jr NTR) అయితే సినిమాలో కనిపించలేదు. మరి వాళ్లేమైనా తర్వాతి పార్టుల్లో ఉంటారేమో చూడాలి.