టాలీవుడ్లో ఓ సినిమా హిట్టయ్యిందంటే… ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది అనేది అప్పటి లెక్క. కానీ ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసింది అనేదే ఎక్కువగా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు ఆయా చిత్ర బృందాలు అలాగే ఆ హీరో అభిమానులు. ముఖ్యంగా సినిమా కలెక్షన్ల విషయంలో కొన్ని ఏరియాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా చెప్పుకునేది ఓవర్సీస్ కలెక్షన్లు. సినిమాకి మంచి టాక్ వచ్చిందంటే అక్కడ డాలర్ల వర్షం కురుస్తున్నాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా కూడా కొంతమంది హీరోల చిత్రాలకి అక్కడ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అందులోనూ 1 మిలియన్ డాలర్ల మార్క్ అవలీలగా దాటేస్తున్నారు ఆ హీరోలు. వాళ్ళు మరెవరో కాదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని.
1) మహేష్ బాబు :ఓవర్సీస్ లో మహేష్ బాబు బాద్ షా అనే చెప్పాలి. ఇప్పటికి 8 సార్లు 1 మిలియన్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించాడు. ఈ హీరో చిత్రానికి అక్కడ హిట్టు ప్లాప్ అనే తేడా ఉండదు. ఎలాగైనా 1 మిలియన్ కొట్టేస్తాడు. ఆఖరికి ‘బ్రహ్మోత్సవం’ లాంటి భరించలేని చిత్రంతో కూడా 1 మిలియన్ కొట్టాడంటే ఈ హీరో కెపాసిటీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘దూకుడు’ చిత్రంతో మొదటి సారి 1 మిలియన్ లిస్ట్ లో చేరాడు మహేష్. తనకి మాత్రమే కాదు.. మన టాలీవుడ్ చిత్రాల్లో కూడా మొదటి 1 మిలియన్ చిత్రం ఇదే. ఆ తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ ‘భరత్ అనే నేను’ ఇలా వరుసగా 8 సార్లు 1 మిలియన్ మార్కును చేరుకున్నాడు. ప్రీమియర్స్ కే మహేష్ చిత్రాలు హాఫ్ మిలియన్ దాటేస్తుంటాయి. ఇక త్వరలో రాబోతున్న ‘మహర్షి’ చిత్రం పై కూడా అక్కడ భారీ అంచనాలున్నాయి.
2) జూ.ఎన్టీఆర్ : ‘బాద్ షా’ చిత్రంతో మొదటిసారి 1 మిలియన్ మార్క్ లో చేరాడు తారక్. ఆ తరువాత ‘రామయ్య వస్తావయ్యా’ ‘రభస’ వంటి రొటీన్ మాస్ సినిమాలు చేయడం వలన ఎన్టీఆర్ ను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ‘టెంపర్’ చిత్రంలో తన విశ్వరూపం చూసి అక్కడి జనాలు సైతం ఫిదా అయిపోయారు. ఆ తరువాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ ‘జనతా గ్యారేజ్’ ‘జై లవ కుశ’ ‘అరవింద సమేత’ వంటి చిత్రాలతో వరుసగా 5 సార్లు 1 మిలియన్ కొట్టాడు. మొత్తంగా 6 సార్లు 1 మిలియన్ చిత్రాలు ఎన్టీఆర్ ఖాతాలో ఉన్నాయి.
3)నాని : చెప్పుకోవడానికి ఏమాత్రం స్టార్ హీరో కాదు. మహేష్, ఎన్టీఆర్ ల చిత్రాలకి మాదిరి.. భారీ స్థాయిలో నాని చిత్రాలు రిలీజ్ అవ్వవు. కానీ 6 సార్లు 1 మిలియన్ కొట్టాడు ఈ న్యాచురల్ స్టార్. ఇతని నటనకి అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. ‘ఈగ’ ‘భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘నిన్నుకోరి’ ‘ఎం.సి.ఏ’ తాజాగా ‘జెర్సీ’. ఇలా వరుసగా ఆరుసార్లు 1 మిలియన్ క్లబ్ లో చేరి.. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సమానంగా ఉన్నాడు. ఇదే ఫామ్లో కొనసాగితే ఎన్టీఆర్ నే కాదు మహేష్ ను కూడా నాని దాటేసినా ఆశ్చర్యపడనవసరం లేదు. నాని ప్లాప్ సినిమాలు కూడా అక్కడ హాఫ్ మిలియన్ దాటేసిన సినిమాలు అరడజన్ ఉన్నాయి. ‘జెంటిల్మేన్’ ‘దేవదాస్’ చిత్రాలు కొద్దిలో 1 మిలియన్ మార్క్ మిస్సయ్యాయి. అవి కూడా 1 మిలియన్ సాధించి ఉంటే మహేష్ తో సమానమైపోయేవాడు నాని అనడంలో సందేహం లేదు. అతను కథలు ఎంచుకునే విధానం అలా ఉంటుంది మరి. అందుకే అక్కడి జనాలు నాని సినిమాలంటే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.