టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు సిద్ధార్థ్ ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ హీరో ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటారు. కోవిడ్ నియంత్రణ విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ గతంలో చాలా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సిద్ధార్థ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు.
రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ మొబైల్ నెంబర్ ను లీక్ చేసిందని ఆరోపించాడు. గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు ఐదు వందల అసభ్య సందేశాలు వచ్చాయని.. తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ లు చేస్తోన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ నంబర్లన్నిటినీ రికార్డ్ చేశానని.. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవేనని.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే అని చెప్పుకొచ్చాడు. వీటన్నింటినీ పోలీసులకు అందించానని.. మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.
దీంతో పాటు తనను బెదిరిస్తూ చేసిన మెసేజ్ ల స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేశాడు. తమిళనాడు బీజేపీ నాయకులే తన నంబర్ లీక్ చేశారని.. చాలా గ్రూపుల్లో తన నెంబర్ చక్కర్లు కొట్టిందని.. అందరూ తనను ట్రోల్ చేశారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను కోవిడ్ తో పోరాడాలా..? లేక ఇలాంటి వారితో పోరాడాలా..? అంటూ వాపోయారు. ఈ విషయంలో సిద్ధార్థ్ కు మద్దతుగా పలువురు నెటిజన్లు, నటీనటులు పోస్ట్ లు పెట్టారు.