సౌత్ హీరోల సినిమాలు నార్త్‌కు వెళ్లడం కొత్తేమీ కాదు. గతకొన్నేళ్లుగా ఇలాంటి సినిమాలు వెళ్తున్నాయి, అయితే కరోనా పరిస్థితుల తర్వాత ఇలా వెళ్లే సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు సినిమాలతోపాటు కథలు కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా పడింది అని చెప్పొచ్చు. మన దక్షిణాది హీరోలు బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ఈ దిశగా ప్రభాస్ నుండి తొలి అడుగులు పడగా… ఆ తర్వాత హీరోలు ప్లాన్స్ షురూ చేశారు.
ఈ క్రమంలో కోలీవుడ్ నుండి సూర్య వెళ్తున్నాడని సమాచారం. అవును సూర్య బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయింది అని చెబుతున్నారు. ఇప్పటికే ధనుష్ అక్కడ కొన్ని సినిమాలు చేసి మంచి ఇమేజ్ సంపాదించాడు. ఇప్పుడు సూర్య అదే పనిలో ఉన్నారట. దీని కోసం దర్శకుడిని కూడా ఫిక్స్ చేసుకున్నారు అని చెబుతున్నారు. త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
ప్రస్తుతం సూర్య… శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన సినిమా టైటిల్, పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అదే జోష్‌లో ఈ ఏడాది చివరన బాలీవుడ్ అరంగేట్రం కోసం సూర్య సిద్ధమవుతున్నట్లు బజ్ కనిపిస్తోంది. ప్రముఖ హిందీ దర్శక నిర్మాత రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో ఒక భారీ పౌరాణిక చిత్రం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కర్ణ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
మహాభారతంలోని కర్ణ పాత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందనుందట. నిజానికి సూర్య – రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ‘కర్ణ’ సినిమా గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘కర్ణ’ 2024లో సెట్స్ పైకి వెళ్లనుందట. మొత్తంగా ఈ సినిమా 2025లో పాన్ ఇండియన్ సినిమాగా విడుదలవుతుందట. దీని కోసం ప్రయత్నాలు తుది దశకు వచ్చాయి అని చెబుతున్నారు.