కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో కూడుకున్న సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతుంటాడు విశాల్. తెలుగు అబ్బాయే అయినప్పటికీ కోలీవుడ్లో నడిగర్ సంఘం అధ్యక్షుడయ్యాడు. అక్కడ ఎన్నో విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇతనికి రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా ఇతను రాజకీయాల్లోకి వస్తున్నాడు, కుప్పం నుండీ చంద్రబాబు పై పోటీ చేయడానికి ఇతను సిద్ధపడ్డాడు అంటూ చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి విశాల్ ధైర్యం చేసేంతలా ప్రేరేపించింది ఎవరు అంటూ చర్చలు కూడా జరిగాయి. దీనిపై విశాల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. తన ‘లాఠీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ‘మాకు కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయి. కుప్పంలో ప్రతిదీ నాకు తెలుసు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు నేను నటుడిగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గం కాదు.
‘ అంటూ చెప్పిన విశాల్.. ఆ తర్వాత ‘నేను పవన్ కళ్యాణ్ అభిమానిని’ అంటూ చెప్పి షాకిచ్చాడు. అదేంటి ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. 2007 టైంలో విశాల్ అప్పుడప్పుడే తెలుగులో స్టార్ గా ఎదుగుతున్న రోజులు. ‘పందెం కోడి’ ‘పొగరు’ ‘భరణి’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘భరణి’ సినిమా ప్రమోషన్స్ టైంలో విశాల్.. ‘నాకు ప్రభాస్ అంటే ఇష్టం.. ప్రభాస్ యాక్టింగ్ నాకు నచ్చుతుంది’ అంటూ తెలిపాడు.
ఆ టైంకి ప్రభాస్ పెద్ద స్టార్ హీరో కూడా కాదు. అయినా సరే విశాల్ ప్రభాస్ అభిమానిని అని చెప్పాడు.ఆ టైంలో ప్రభాస్ క్రేజ్ ను విశాల్ వాడుకునేంత స్కోప్ కూడా లేదు. అయినా సరే ప్రభాస్ పేరు చెప్పాడు విశాల్. ఇప్పుడు మాత్రం ‘నేను పవన్ కళ్యాణ్ అభిమానిని’ అంటూ మాట మార్చేశాడు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినా విశాల్ ఎందుకు ఇలా మార్చాడో మరి.!