కొన్ని సినిమాలను పాటల కోసం, మరికొన్ని సినిమాలు మాటల కోసం చూడాలి అనిపిస్తుంటుంది. అలా అని అందులో హీరో హీరోయిన్, ఇతర నటులు బాగా నటించలేదు అని కాదు. ఆ సినిమాల్లో మాటలో, పాటలో బాగా హైలైట్ అయ్యాయి అని. అలాంటి బజ్ను రీసెంట్ టైమ్స్‌లో అందుకున్న చిత్రం ‘హాయ్ నాన్న’. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో నాని, చిన్నారి కియారా మధ్య వచ్చిన సంభాషణలు చూసి చప్పట్లు మోత మోగుతోంది థియేటర్లలో.
ఈ నేపథ్యంలో ఆ మాటలు రాసింది ఎవరు అనే చర్చ మొదలైంది. ఎవరా అని చూస్తే… ఆయన సుకుమార్ శిష్య బృందంలో ఒకరు అని తెలిసింది. తొలుత నుండి సుకుమార్ దగ్గర లేకపోయినా ఇప్పుడు ఆయన అతని దగ్గరే ఉన్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పలాస’, ‘విరూపాక్ష’, ‘కోట బొమ్మాళి పీఎస్’ లాంటి సినిమాలకు రచనా విభాగంలో పని చేసిన నాగేంద్ర కాశినే ‘హాయ్ నాన్న’కు (Hi Nanna) మాటలు రాశారు. ‘పలాస’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ తర్వాత సుకుమార్ రైటింగ్స్ టీమ్‌లో చేరారు నాగేంద్ర.
ఆ తర్వాత ‘పుష్ప’, ‘విరూపాక్ష’ సినిమాలకు పని చేశారట. గతంలో తాను రాసిన ‘నల్ల వంతెన’ అనే పుస్తకం చూసి ‘హాయ్ నాన్న’లో అవకాశం ఇచ్చారట. ‘హాయ్ నాన్న’ సినిమాలో పాపకు తన తల్లి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు, అసలు కథను దాస్తూ చెబుతాడు నాని. ఆ సమయంలో ఎమోషన్‌ను పాప ఆలోచనా శక్తికి అందేలా చిన్న చిన్న మాటలతో చెప్పించారు. ఆ మాటలు రాసేటప్పుడు చాలా కష్టపడ్డానని నాగేంద్ర కాశి తెలిపారు. సినిమా విడుదలయ్యాక ఆ మాటలకు ప్రశంసొలచ్చాయి అని కూడా చెప్పారు.
ఇక మీ బ్యాగ్రౌండ్ ఏంటి అని అడిగితే… తనది కోనసీమ అని, బీటెక్ పూర్తి చేశాక ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేశానని తెలిపారు. అయితే చిన్నప్పటి నుండి కథలు రాయడమంటే ఇష్టమని, అందుకే ‘నల్ల వంతెన’ అనే పుస్తకం రాశానని చెప్పారు. భవిష్యత్తులో దర్శకత్వం చేయొచ్చేమో కానీ… ఇప్పటికైతే రచనపైనే తన దృష్టి ఉందని తెలిపారు. కొత్త సినిమాలేంట చేస్తున్నారు అంటే… ‘పుష్ప2’, బుచ్చిబాబు సినిమా, ‘రెయిన్‌బో’ సినిమాలకు రచనా విభాగంలో ఉన్నానని తెలిపారు.