ప్రభాస్ – ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోతున్నా.. వివాదాల రన్ ముగియడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకాస్త ముదిరేలా కనిపిస్తోంది. కారణం ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ తదితర అంశాల మీద అలహాబాద్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో సినిమా వివాదాలు, చర్చల పంచాయతి ఇంకొన్నాళ్లు సాగేలా కనిపిస్తుంది. సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించారా అనే విషయానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్ అనే ఇద్దరు వేర్వేరుగా (Adipurush) ‘ఆదిపురుష్’ సినిమా మీద పిటిషన్లు వేశారు. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాష్ సింగ్‌తో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు కేసును విచారించింది. జులై 27న తమ ముందు చిత్రబృందం హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ తీర్పు వచ్చినా… ఆ ఉత్తర్వులను హైకోర్టు శుక్రవారం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అందులో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. కోర్టులో హాజరు కావాలని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కూమార్, మాటల రచయిత మనోజ్ మంతాషిర్‌ను ఆదేశించింది.
ప్రజల మనోభావాలను ఈ సినిమా దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేసిన నిర్ణయాన్ని కూడా సమీక్షించాలని నిర్దేశించింది. సినిమా సర్టిఫికేషన్ మార్గదర్శకాలను పాటించారా అనే విషయమై వివరణ ఇచ్చేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఛైర్మన్ వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది.
తదుపరి విచారణ తేదీలోగా అఫిడవిట్‌లు దాఖలు చేయకపోతే… ఏం జరుగుతుంది అనే విషయమై కూడా హైకోర్టు తీర్పులో ప్రస్తావించంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ స్థాయిలో లేని క్లాస్ 1 అధికారి, సీబీఎఫ్‌సీకి అధికారి రికార్డులతో సహా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పింది. అఫిడవిట్‌లు వచ్చే వరకు చిత్రబృందం సభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని కూడా అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!