ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో పలు వివాదాస్పద పోస్ట్ లు చేస్తూ, వ్యూహం సినిమాను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను (Pawan Kalyan) కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలతో మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, వర్మ అభ్యర్థనను తిరస్కరించింది. నేరుగా రక్షణ కోరడం కంటే ముందుగా తగిన విధంగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతులు లేకుండా నేరుగా రక్షణ కోరడం అనేది సరైన పద్ధతి కాదని పేర్కొంది. వర్మ తరపున న్యాయవాది విచారణకు మరింత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు ఆ విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది.
మద్దిపాడు పోలీసులు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా చేసినవని పోలీసుల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్మకు హైకోర్టు నుంచి రావాల్సిన ఊరట దక్కలేదు, ఇక విచారణలో పాల్గొనాల్సి రావడం ఆర్జీవీకి మరో ఎదురుదెబ్బగా మారింది.
ఈ కేసులో హైకోర్టు, మద్దిపాడు పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించడం వర్మకు అనుకూలంగా మారలేదు. తన వ్యాఖ్యలపై ఉన్న ఆరోపణలను ఎదుర్కోవడానికి న్యాయపరమైన మార్గాలనే అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్మకు ఉన్న ఆప్షన్లపై చర్చ జరుగుతోంది.