హాలీవుడ్ సినిమాల గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడి సినిమాలు, వసూళ్లు… ఇలా చాలా విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు హాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా ఓ సమస్య ఉంది. మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నట్లే ఆ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే హాలీవుడ్‌లో సమ్మె. రెమ్యునరేషన్లు పెంచాలని, కృతిమమేధ వల్ల పొంచి ఉన్న ముప్పును తప్పించాలంటూ హాలీవుడ్ నటీనటులు, సినీవర్గాలు గత కొన్ని నెలలుగా సమ్మెలు చేస్తున్న విషయం తెలిసిందే.
సమ్మె కారణంగా సినిమా పనులు చాలా వరకు ఆగిపోయాయి. దీంతో స్టూడియోలు, నటీనటుల మధ్య చర్చలు జరిగాయి. అయితే చర్చలు విఫలం కావడంతో కాంట్రాక్ట్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్టూడియోలు ప్రకటించాయి. బుధవారం అర్ధరాత్రి నుండి ఈ నిలిపివేత ఉంటుంది అని తెలిపారు. సమ్మె విషయానికొస్తే… జులై 14న సమ్మె ప్రారంభమైంది. అయితే మొదటిసారిగా అక్టోబరు 2న అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్‌తో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ – అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్, రేడియో ఆర్టిస్ట్స్ విభాగాలు చర్చలను ప్రారంభించాయి.
గత నెలలో సమ్మెను ఐదు రోజులపాటు నిలిపి వేసి సమ్మెకు ఓ ముగింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఇప్పుడు చర్చలు కూడా విఫలమయ్యాయి. నటీనటుల ప్రతిపాదనలకు స్టూడియోలు దూరంగా ఉండటమే దానికి కారణం అని అంటారు. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్, రేడియో ఆర్టిస్ట్స్ ప్రతిపాదనల వల్ల నిర్మాణ సంస్థలకు ఏడాదికి 800 మిలియన్ డాలర్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
అది చాలా భారంగా మారుతుంది అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ తెలిపింది. ఈ మొత్తం విషయం సింపుల్‌గా చెప్పాలంటే నటీనటుల ప్రతిపాదనలు సినిమా నిర్మాణ సంస్థలు నో చెబుతున్నాయి. దీంతో ఈ విషయంలో ఎప్పటికి ప్రతిష్టంభన తొలుగుతుందో చూడాలి. ఈ సమస్య వస్తే ఇటీవల జరిగన కామికాన్ వేడుకకు దీపికా పడుకొణె హాజరు కాని విషయం తెలిసిందే. ఆమె నటీనటుల అసోసియేషన్ సభ్యురాలు అనే విషయం తెలిసిందే.