Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఇషాన్ కత్తర్, విశాల్ జెత్వా (Hero)
  • జాన్వీ కపూర్ (Heroine)
  • హర్షిక పర్మార్, శాలిని వత్స, చందన్ కె.ఆనంద్ (Cast)
  • నీరజ్ గైవాన్ (Director)
  • కరణ్ జోహార్ - అడార్ పూనావాలా - అపూర్వ మెహతా - సోమెన్ మిశ్రా (Producer)
  • అమిత్ త్రివేది - నరేన్ చంద్రవర్కార్ - బెనెడిక్ట్ టైలర్ (Music)
  • ప్రతీక్ షా (Cinematography)
  • నితిన్ బెయిడ్ (Editor)
  • Release Date : సెప్టెంబర్ 26, 2025
  • ధర్మ ప్రొడక్షన్స్ (Banner)

2025 సంవత్సరంలో 98వ ఆస్కార్ వేడుకకు ఇండియా అఫీషియల్ గా పంపిన చిత్రం “హోమ్ బౌండ్”. నీరజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇషాన్, విశాల్ హీరోలుగా నటించగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ప్రభుత్వ విధానాలు, సమాజంలో కుల, మత వివక్ష కొందరి జీవితాలను ఎలా నాశనం చేస్తుంది అనేది ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

Homebound Review

కథ:

మొహమ్మద్ షోయబ్ అలీ (ఇషాన్ కత్తర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా)లు చిన్నప్పటినుండి స్నేహితులు. ఇద్దరు కలిసి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తారు. దాని రిజల్ట్ కోసం వెయిట్ చేసే టైంలో చందన్ కు సుధ (జాన్వీ కపూర్)తో పరిచయం ఏర్పడి, ఆమె కోసం చందన్ డిగ్రీ కాలేజ్ లో జాయినవుతాడు.

షోయబ్ కుటుంబం కోసం ఒక ఆఫీస్ లో ఆఫీస్ గా జాయినవుతాడు. ఇద్దరి జీవితాలు సెటిల్ అవుతున్నాయి అనుకునే సమయంలో ప్రభుత్వ లేదా సమాజం అలసత్వం కారణంగా వారి ప్లానింగ్ మొత్తం ఫెయిల్ అవుతుంది.

ఆ తర్వాత వాళ్లిద్దరూ ఏం చేశారు? వాళ్లు ఊహించుకున్నట్లుగా జీవితంలో సెటిల్ అయ్యారా? అనేది “హోమ్ బౌండ్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు:

ఇషాన్ మంచి నటుడు అనే విషయం తెలిసిందే. ఎందుకనో అతడి నటనని ఎలివేట్ చేసే పాత్రలు సరిగా రావట్లేదు. కొన్ని నవసరమైన వెబ్ సిరీస్ లు చేస్తూ తన ఇమేజ్ కు డ్యామేజ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఫార్మ్ హౌస్ పార్టీ సీన్ లో అతడి నటన చూస్తే అర్థమవుతుంది, నటుడిగా అతడి పొటెన్షియల్ ఏమిటి అనేది. క్లైమాక్స్ లో స్నేహితుడిని ఒడిలో పడుకోబెట్టుకొని ఏడ్చే సన్నివేశంలో బాధ, అలసత్వం కలగలిపి పలికించిన తీరు ప్రశంసార్హం.

మరో నటుడు విశాల్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సమాజం, ప్రభుత్వం, కారణంగా అణిచివేయబడిన బాధను అతడు పండించిన విధానం కలచివేస్తుంది.

చాలారోజుల తర్వాత జాన్వీ కపూర్ నటించింది అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఫోన్ పెట్టేసి ఏడ్చే సీన్ లో చాలా సహజంగా కనిపించింది ఆమె బాధ.

మిగతా సహాయ పాత్రల్లో నటించినవాళ్ళందరూ అద్భుతంగా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు:

టెక్నికల్ గా డీసెంట్ సినిమాగా చెప్పుకోవచ్చు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే వినిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా.. జనాలని లైట్ల కింద చీమల్లా చూపించే సన్నివేశంలో భావం భలే వ్యక్తపరిచాడు సినిమాటోగ్రాఫర్ ప్రతీక్ షా.

దర్శకుడు నీరజ్ ఎంచుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ఆ కథలో చర్చించిన అంశాలు చాలా రిలేటబుల్ గా ఉన్నాయి. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. సమాజంలోని బేధాలను వివరించిన తీరు కచ్చితంగా ఆకట్టుకుంటుంది. స్కూల్లో వంట మనిషి తక్కువ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసినప్పుడు జనాలు రియాక్ట్ అయిన తీరును చాలా సహజంగా చూపించాడు. అలాగే.. కరోనా టైంలో కార్మికుల కష్టాలను గ్లోరిఫై చేయకుండా.. సహజంగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. కథకుడిగా, దర్శకుడిగా వీలైనంత సహజంగా సినిమాని తెరకెక్కించడానికి అతడు చేసిన ప్రయత్నాన్ని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అది మాత్రమే కాదు.. క్యారెక్టర్ బిహేవియర్ ను అతను సందర్భానుసారంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసిన విధానం రచయితగా అతడి ప్రతిభకు తార్కాణం.

విశ్లేషణ:

ప్రభుత్వం లేదా సమాజం చర్యలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడూ దిగువ మధ్యతరగతి కుటుంబాలే. అది డీమానిటైజేషన్ అవ్వొచ్చు, లాక్ డౌన్ అవ్వొచ్చు. అసలు సామాన్యులు ఎలా డీల్ చేయగలరు అనే బేసిక్ సెన్స్ లేకుండా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. అలాగే.. సమాజంలో ఇప్పటికీ కుల, మత వివక్షలు ఎంత నీచంగా ఉన్నాయి అనేది వేలెత్తి చూపిన విధానం ఇలాంటి సమాజంలోనే మనమూ ఉన్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఇలా ఆలోచింపజేసే, ప్రశించేలా చేసే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. అయితే.. ఇది డ్రామా అవ్వడం వల్ల రెండు గంటలపాటు ఈ చిత్రాన్ని ఓపిగ్గా చూడడం అనేది అందరి వల్లా అవ్వదు. అయితే.. ఆర్టిస్టిక్ గా చూస్తే మాత్రం ఎంతో లోతైన భావం ఉంది సినిమాలో.

ఫోకస్ పాయింట్: దిగువ మధ్యతరగతి బ్రతుకు పోరాటం!

 

రేటింగ్: 2.5/5

రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus