Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మోహన్ లాల్ (Hero)
  • మాళవిక మోహనన్ (Heroine)
  • సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ (Cast)
  • సత్యన్ అంతికాడ్ (Director)
  • ఆంటోనీ పెరుంబవూర్ (Producer)
  • జస్టిన్ ప్రభాకరన్ (Music)
  • అను మూతేదాత్ (Cinematography)
  • కె.రాజగోపాల్ (Editor)
  • Release Date : ఆగస్ట్ 28, 2025
  • ఆశీర్వాద్ సినిమాస్ (Banner)

కొన్ని మలయాళ సినిమాలు ఇండియా మొత్తం ఊపేస్తుంటే.. ఇంకొన్ని మాత్రం వచ్చినట్లు కూడా తెలియడం లేదు. అలా విడుదలై ప్రేక్షకులకు కనిపించకుండా ఓటీటీలో ప్రత్యక్షమైన తాజా మలయాళ చిత్రం “హృదయపూర్వం”. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్ కి ముందు మంచి హైప్ ఉన్నప్పటికీ.. “లోకా” ఫీవర్ ముందు నిలబడలేకపోయింది. మరి ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కథ:

గుండె ఆపరేషన్ లో పుణేకు చెందిన ఓ కల్నల్ గుండె ద్వారా బ్రతుకుతాడు సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్). అంతా బాగానే సెటిల్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో.. ఆ కల్నల్ కూతురు హరిత (మాళవిక మోహనన్) సందీప్ ను వెతుక్కుంటూ వచ్చి మరీ తన ఎంగేజ్మెంట్ కి తప్పకుండా రావాలని వెంట తీసుకుని పుణె తీసుకెళ్తుంది.

అక్కడికి వెళ్ళాక.. హరిత మరియు ఆమె తల్లి దేవిక (సంగీత మాధవన్)లతో ఊహించని అనుబంధం ఏర్పడుతుంది సందీప్ కి.

ఆ క్రమంలో తాను కల్నల్ కూతురైన హరితను ఇష్టపడుతున్నానా లేక కల్నల్ భార్య దేవికను ఇష్టపడుతున్నానా? అనే అనుమానం కలుగుతుంది సందీప్ కి.

ఆ అనుమానం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నుండి సందీప్ ఎలా బయటపడ్డాడు? అనేది “హృదయపూర్వం” కథాంశం.

నటీనటుల పనితీరు:

సాధారణంగా సినిమాల్లో హీరోలని వీరాధివీరులుగా చూసి చూసి బోర్ కొట్టేయడం వల్లనో ఏమో కానీ.. ఈ సినిమాలో ఓ గుండె ఆపరేషన్ జరిగిన వ్యక్తిగా, చాలా సున్నితంగా కనిపించే హీరోగా మోహన్ లాల్ ను చూడడం కొత్తగా ఉంది. ఇలాంటి హీరోల పాత్రల ద్వారా హీరోయిజం ఎలివేట్ చేసే విధానం భలే ఉంటుంది. అందులో మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్ ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశాడు.

“ప్రేమలు” ఫేమ్ సంగీత్ ప్రతాప్ సహాయ పాత్రలో మంచి హాస్యంతో అలరించాడు. హరిత పాత్రలో మోడ్రన్ & ఇండిపెండెంట్ ఉమెన్ గా మాళవిక ఒదిగిపోగా, తల్లి పాత్రలో సంగీత మాధవన్ నాయర్ చాలా సహజంగా నటించింది.

సిద్ధికీ కామెడీ టైమింగ్ ను మరోసారి ఆస్వాదించే అవకాశం లభించింది.

సాంకేతికవర్గం పనితీరు:

జస్టిన్ ప్రభాకర్ సంగీతం, అను మూతేదాత్ సినిమాటోగ్రఫీలు సినిమాని ప్లెజెంట్ గా ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి.

సీనియర్ దర్శకుడు సత్యన్ ఒక సింపుల్ కథను, ఎమోషనల్ కనెక్టివిటీతో చెప్పాలనుకున్నాడు. ఆయన మునుపటి సినిమాలు కూడా అదే తరహాలో ఉంటాయి. అయితే.. “హృదయపూర్వం” సినిమా విషయంలో సెకండాఫ్ నుంచి కథ ముందుకు వెళ్లదు. బోనులో ఇరుక్కున్న ఎలకలా ఉన్నచోటే తిరుగుతూ ఉంటుంది. అందువల్ల కొన్ని హ్యాపీ ఎమోషన్స్ & కొన్ని మంచి డైలాగ్స్ ఉన్నప్పటికీ.. అప్పటికే సాగిన సినిమాకి ఆ ఎమోషన్ ను ఆడియన్స్ ఫీల్ అవ్వడం మానేసి, సినిమా ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేయడం మొదలెడతారు. ఆ విషయంలో మేకర్స్ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

విశ్లేషణ:

కొన్ని సినిమాలు చూడడానికి బాగున్నా.. ఎందుకనో చూసే ఓపికను కలిగించలేవు. “హృదయపూర్వం” అలాంటి సినిమానే. మంచి క్యాస్టింగ్, చాలా మంచి పాయింట్ ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే విషయంలో సాగతీత, ఆ పుణె గార్డెన్ లో సినిమాని గంటకుపైగా సాగదీసిన విధానం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. ఓటీటీలో ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి టైంపాస్ కోసం ఫ్యామిలీ మొత్తం ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసేయొచ్చు.

ఫోకస్ పాయింట్: ల్యాగ్ సిండ్రోమ్ తో బాధపడిన మరో మలయాళ చిత్రం!

రేటింగ్: 2/5

హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus