పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు ‘సాహో’ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ‘హరి హర వీరమల్లు’ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సెట్స్ వేసిన సంగతి తెలిసిందే.
సినిమాలో కీలకమైన పోరాట సన్నివేశాలను ఇందులో చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రం కథ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నారనేది తాజా సమాచారం. మొన్నామధ్య విడుదల చేసిన ‘హరి హర వీర మల్లు’ గ్లింప్స్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. దానిని చూస్తే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని అంతా అనుకున్నారు.
వారి అంచనా నిజమే అయ్యింది. అయితే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనగానే మనకి రాజమౌళి సినిమాలే ఎక్కువగా గుర్తుకొస్తాయి.కానీ రూ.50 కోట్ల బడ్జెట్ లోనే క్రిష్.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో విజువల్ ఎఫెక్ట్స్ ను చాలా గ్రాండ్ గా చూపించారు. ఇప్పుడు పవన్ సినిమాలో అవి మరింత అద్భుతంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా చెబుతున్నారు. అందుకే మొదట రూ. 100 కోట్లు అనుకున్న ఈ చిత్రం బడ్జెట్ .. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా మరో రూ.50 కోట్లు పెరిగినట్టు స్పష్టమవుతుంది.