టాక్ తో సంబంధం లేకుండా ‘బ్రహ్మాస్త్ర’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అనుకున్నంత రేంజ్ లో కంటెంట్ లేదనే మాటలు వినిపిస్తున్నా.. ఒక్కసారైనా ఈ సినిమాను చూడాల్సిందేనని ఎక్కువశాతం మంది చెబుతున్నారు. దీంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ‘సీతారామం’ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం.. మెజారిటీ ఆడియన్స్ ‘కార్తికేయ2’ని చూసేయడంతో ‘బ్రహ్మాస్త్ర’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు మంచి ఆప్షన్స్ గా మారాయి.
ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.9 కోట్లకు పైగా రాబట్టిందని సమాచారం. తెలుగులో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం రాజమౌళి అనే చెప్పాలి. ఆయన ప్రెజంట్ చేసిన సినిమా కావడం, ప్రమోషన్స్ లో సినిమాను పొగుడుతూ ఆయన మాట్లాడడంతో జనాలు ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి స్నేహితుడు సాయి కొర్రపాటి విడుదల చేశారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.75 కోట్లు గ్రాస్ వచ్చిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది బాలీవుడ్ లో విడుదలైన సినిమాల్లో ‘బ్రహ్మాస్త్ర’కే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ లో ఈ సినిమా సత్తా చాటుతోంది. వారం తిరిగేలోపు బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగో వచ్చే రెండు వారాల్లో చెప్పుకోదగ్గ రిలీజెస్ లేవు కాబట్టి సోమవారం నుంచి కూడా ‘బ్రహ్మాస్త్ర’ జోరు చూపించడం ఖాయం.
మిక్స్డ్ టాక్ తోనే ఈ సినిమా ఇన్ని కలెక్షన్స్ రాబడుతుంటేనే.. కంటెంట్ బాగుంటే వేరే రేంజ్ లో ఉండేది. దర్శకుడు అయాన్ ముఖర్జీ కంటెంట్, గ్రాఫిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే మాత్రం బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది ఈ సినిమా. ప్రస్తుతానికైతే.. ఈ సినిమాతో బాలీవుడ్ కు పెద్ద రిలీఫ్ దక్కినట్లే చెప్పుకోవాలి!