యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తెలుగులో హిట్టు కొట్టి రెండు దశాబ్దాలు కావస్తోంది. 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. దాని తర్వాత కమల్ చేసిన సినిమాల్లో ‘దశావతారం’ ‘విశ్వరూపం'(పార్ట్ 1) యావరేజ్ కాగా ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ వంటి సినిమాలు బిలో యావరేజ్ అన్నట్టు ఆడాయి. అయితే అవి కూడా చివరికి నష్టాలనే మిగిల్చాయి లెండి. మొత్తంగా 19 ఏళ్ళ నుండీ కమల్ హాసన్ కు తెలుగులో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ఈ గ్యాప్ లో విజయ్, కార్తీ, సూర్య, విశాల్ వంటి హీరోలకు ఇక్కడ క్రేజ్ పెరిగింది. అందరికంటే విజయ్ తెలుగులో కూడా బాగా రాణిస్తున్నాడు.
అతని సినిమాలకు ఇక్కడ రూ.10 కోట్ల వరకు మార్కెట్ ఏర్పడింది. రజినీ సినిమాలని కూడా అంత పెట్టి కొనడానికి ఇక్కడి బయ్యర్స్ ఇప్పుడు సాహసించడం లేదు. కానీ కమల్ హాసన్ అప్ కమింగ్ మూవీని ఏకంగా రూ.11.5 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని వినికిడి. వివరాల్లోకి వెళితే.. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కానగరాజన్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రం తెరకెక్కుతోంది.
దీనికి తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.11.5 కోట్లు పలుకుతుందట. దర్శకుడు లోకేష్ తెరకెక్కించిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి కలెక్షన్లను రాబట్టాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. అదొక కారణం అనుకుంటే.. ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్(పుష్ప విలన్) కూడా నటిస్తుండడంతో ఇంత భారీ రేటు పలికినట్టు తెలుస్తుంది.