భాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసుల్లో చాలామంది సక్సెస్ అయ్యి తమదైన బాటని ఏర్పరుచుకున్నారు. కొందరు మాత్రం ఈ ప్రయత్నంలో విఫలమయ్యారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ పేరు అభిషేక్ బచ్చన్. తండ్రి అమితాబ్ బాలీవుడ్ కె తలమానికం. అభిషేక్ ఆయన తనయుడన్న పేరేగాని ఆ స్థాయిలో విజయవంతం కాలేకపోయాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అమితాబ్ తో ‘బుడా హోగా తేరా బాప్’ సినిమా చేసిన పూరి అభిషేక్ తో ‘టెంపర్’ రీమేక్ చేయాలనుకోగా అభిషేక్ తిరస్కరించడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోన్న పూరి జగన్నాధ్ బాలీవుడ్ లోను రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆ కోవలో తెలుగులో సంచలన విజయం సాధించిన ‘టెంపర్’ని అభిషేక్ బచ్చన్ తో రీమేక్ చేయాలని సంప్రదించగా జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో తాను భావోద్వేగాలు పలికించలేనని ఒప్పుకుని తప్పుకున్నాడట జూనియర్ బచ్చన్. నిజమే ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికించిన భావోద్వేగాలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అభిషేక్ వద్దన్నాడు సరే మిగతా హీరోలను పూరి ఎందుకు సంప్రదించలేదు మరి..! ఈ సంగతిలా ఉంటే బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయన్న పూరి అక్కడికి వెళితే కొంతకాలం తెలుగు సినిమాకి దూరమవ్వాల్సి వస్తుంది గనక ఇక్కడే వరుస సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఎంతకాదన్న అక్కడ ఓ సినిమా చేయాలంటే ఆరేడు నెలల సమయం కావాలి. ఆ టైమ్ లో పూరి ఇక్కడ రెండు సినిమాలు పూర్తి చేసి మూడో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసేస్తాడు. పూరి స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే.