షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసి.. “ప్రేమ ఇష్క్ కాదల్” చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి రీతూ వర్మ. 2016లో సెన్సేషనల్ హిట్ సాధించిన “పెళ్ళిచూపులు” చిత్రంలో కథానాయికగా నటించింది. ఆ సినిమా సాధించిన విజయాన్ని బట్టి ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకొన్నారు జనాలు. కానీ.. తెలుగులో సరైన ఆఫర్లు రాకపోవడంతో.. అందరు తెలుగు హీరోయిన్ల వలె తమిళనాడు పయనమైంది రీతువర్మ. అక్కడ విక్రమ్ సరసన “ధృవ నక్షత్రం” లాంటి క్రేజీయస్ట్ ఫిలిమ్ లో కథానాయికగా నటించే అవకాశం సొంతం చేసుకొంది కానీ.. ఆ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనేది రెండేళ్లు గడుస్తున్నా క్లారిటీ లేదు. దాంతో అమ్మడు అటు తమిళంలో సరైన విడుదల లేక.. ఇటు తెలుగులో మంచి అవకాశం లేక ఢీలాపడింది.
ఎట్టకేలకు శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా సైన్ చేసింది. ఈ సినిమాతో రీతువర్మ మళ్ళీ తెలుగుకి వచ్చేసినట్లే.. రీతూ వర్మ ఈజ్ బ్యాక్ టు టాలీవుడ్ అని ఎవరైనా అంటే మాత్రం అమ్మడికి నచ్చడం లేదు. నేను తెలుగమ్మాయిని.. కేశవ’ తర్వాత నాకు తెలుగులో ఎగ్జైటింగ్ ప్రొజెక్ట్స్ ఏమీ దొరకలేదు. అందుకే తమిళంలో నటించాను. శర్వానంద్ సినిమా కథ విన్న వెంటనే నచ్చేసింది. అందుకే సైన్ చేశాను. ఆ మాత్రానికి నేను ఏదో టాలీవుడ్ వదిలి వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చినట్లు.. “రీతూ వర్మ ఈజ్ బ్యాక్” అనడం నాకు నచ్చడం లేదు అని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ధృవ నక్షత్రం” విడుదల కోసం ఎదురుచూస్తుంది. ఆ సినిమా తన కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది అనేది ఆమె నమ్మకం.