థియేటర్లకు తమిళ్ రాకర్స్ ఎలాగో.. ఓటీటీలకు ఐ బొమ్మ అలాగా. ఈ ఒక్క వాక్యం చాలు ఐ బొమ్మ గురించి చెప్పడానికి. పైరసీని అధికారికంగా చేసినట్లు వెబ్‌సైట్ పెట్టి మరీ యూజర్లకు అందిస్తోంది ఐబొమ్మ. ఈ వెబ్‌సైట్ పెట్టి కొద్ది రోజులే అయినా ఫ్రీగా ప్రీమియం కంటెంట్ చూసే అవకాశం ఉండటంతో చాలా మంది వాడేస్తున్నారు. దీని వల్ల లాభాలేంటో, నష్టాలేంటో చర్చలోకి మనం వెళ్లకుండా.. తాజాగా ఐబొమ్మ టీమ్ చేసిన ఓ పబ్లిసిటీ స్టంట్ గురించి చదువుకుందాం.
‘‘ఐబొమ్మ కోసం మేం చాలా కష్టపడుతున్నాం. ప్రేక్షకులకు ఉచితంగా కంటెంట్ ఇచ్చే ఉద్దేశంతో మేం సర్వర్ల కాస్ట్‌లు, బ్యాండ్ విడ్త్‌లు తీసుకుంటూ వీడియో కంటెంట్ ఇస్తున్నాం. అయితే మేం యూజర్ల డేటాను తీసేసుకుంటున్నామని, యాడ్స్ ద్వారా ఏదో సంపాదించేస్తున్నామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు మాకు ఖర్చు కూడా పెరిగిన నేపథ్యం సర్వీసులు నిలిపేయాలని నిర్ణయించాం. త్వరలో డేట్ చెబుతాం’’ గురువారం మధ్యాహ్నం ఐబొమ్మ టీమ్ ఓ పెద్ద బహిరంగ లేఖ రాసుకొచ్చింది. ఇంగ్లిష్, ట్రాన్స్‌లేటెడ్ తెలుగులో ఆ లేఖ పెట్టారు.
దీంతో మా వినోదం పోతోంది అంటూ కొంతమంది బాధపడిన మాట వాస్తవమే. అయితే ఓటీటీ పైరసీ డోర్ లాంటి ఐబొమ్మ మూసేస్తుండేసరికి హమ్మయ్య అని ఓటీటీ వాళ్లు ఆనందపడ్డాడరు. అయితే సాయంత్రానికి మళ్లీ ‘తూచ్ మేం మూసేయడం లేదు. సర్వీసులు నిలిపేయొద్దు అంటూ చాలా మెయిల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు వస్తున్నాయి. మీ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ‘క్లోజింగ్’ ప్రకటనను వెనక్కి తీసుకుంది ఐ బొమ్మ టీమ్. దీంతో యూజర్లు హమ్మయ్య అనుకుంటే, మా పరిస్థితి మళ్లీ డౌన్ అని ఓటీటీలు అనుకుంటున్నాయి.
ఐబొమ్మ సర్వీసు లీగల్ కాదు. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ ఎక్కడ ఎందులో ఏ కంటెంట్ వచ్చినా చాలు ఇక్కడ ప్రత్యక్షమవుతోంది. ఓటిటిలు అందుబాటు ధరల నుండి దూరంగా జరుగుతుండటంతో ఐబొమ్మకు బంగారం లాంటి అవకాశంలా మారింది. అయితే పైరసీని ఎంకరేట్ చేయకూడదు. ఇలా బహిరంగంగా మూసేస్తున్నాం అని మెసేజ్‌లు పెట్టి, మాకు వస్తున్న ఆదరణ, ప్రేమ ఇదీ అని చూపించుకోవాలనే ఐ బొమ్మ ఈ బహిరంగ లేఖ రాసింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైతే ఏముంది ఐబొమ్మ ప్లాన్ ఫలించింది. ఓటీటీలు గట్టి ప్రయత్నం చేయకపోతే వాళ్లకు ‘బొమ్మ’ కనిపిస్తుంది.