సంగీత ప్రపంచంలో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై న్యాయపోరాటానికి దిగారు. ఇందుకు కారణం మైత్రీ సంస్థ ఇటీవల నిర్మించిన కోలీవుడ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా ఆదిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 10న విడుదలై మంచి విజయాన్ని సాధిస్తోంది.
అయితే సినిమాలో కొన్ని సీన్లలో ఇళయరాజా (Ilaiyaraaja) స్వరపరిచిన పాత తమిళ్ పాటలను రీమిక్స్ చేసి వినిపించారని ఆరోపిస్తూ, ఆయన మైత్రీ సంస్థకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ పాటలను తన అనుమతి లేకుండా వాడినందుకు నష్టపరిహారంగా రూ. 5 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాక, గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) చిత్రంలో వినిపించిన మూడు పాటలను వెంటనే ఆపాలని కోరుతూ, చిత్ర బృందం తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ రీమిక్స్ పాటలు ఫ్యాన్స్ థియేటర్‌లో ఎక్కువగా ఎంజాయ్ చేయడం, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ తరఫున త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇళయరాజా తరచుగా తన పాటలపై కాపీరైట్ లీగల్ ప్రొటెక్షన్ కోసం నడిచే వ్యక్తిగా పేరుంది.
గతంలో కూడా కొన్ని సినిమా యూనిట్లపై ఇలానే కేసులు వేశారు. అలాగే ప్రముఖ సింగర్స్ కూడా తన పాటలను అనుమతి లేకుండా ఈవెంట్స్ లలో పాడడం కరెక్ట్ కాదని అన్నారు. ఈసారి కూడా అదే పద్ధతిని పాటించారు. మైత్రీ సంస్థ తమిళ్ ఇండస్ట్రీలో మొదటి సినిమానే ఇది కావడంతో, ఈ వివాదం వారికి తొలిసారి ఎదురవుతున్న సంకటంగా మారింది. మొత్తానికి బ్లాక్‌బస్టర్ హిట్ తో పండగ చేసుకుంటున్న మైత్రీకి ఇళయరాజా (Ilaiyaraaja) నోటీసులు ఊహించని షాక్ ఇచ్చాయి. ఇప్పుడు మైత్రీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.