సినిమా పాటల యుందు ఇళయరాజా పాటలు వేరయా.. ఆయన సంగీతంలోని గొప్పతనం గురించో, ఆయన పాటల్లోని వైవిధ్యం గురించో చెబుతున్నాం అనుకునేరు. ఆయన పాటలను తిరిగి వాడుకోవడం గురించి చెబుతున్నాం. సినిమాల్లోని ఇళయరాజా పాటల్ని మరోసారి ఎక్కడా వాడకూడదు. ఈ మేరకు ఆయన తన పాటల హక్కుల్ని అమ్మేశారు. ఎవరైనా వాడితే ఆయనకు సంబంధించిన సంస్థలకు హక్కులు చెల్లించాల్సిందే.
ఈ వ్యవహారంలో అవగాహన లేకనో, లేక అంతవరకే అవగాహన ఉండటమో కాదు కానీ.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) టీమ్ ఇళయరాజా పాటను వాడుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కోర్టు వరకు ఈ విషయం వెళ్లింది కూడా. తాజా ఈ కేసును తేల్చుకున్నారట. ఈ మేరకు ఇళయరాజాకు కొంత పెద్ద మొత్తమే చెల్లించారు అని కోడంబాక్కం వర్గాల సమాచారం. పుకార్లు నిజమైతే ‘మంజుమ్మెల్ బాయ్స్’ వర్సెస్ ఇళయరాజా ఇష్యూ తేలిపోయింది.
‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో ‘గుణ’ సినిమాలోని ‘కణ్మని అన్బోదు కాదలన్’ / ‘కమ్మని ఈ ప్రేమ లేఖని’ పాటపై పాటను వాడుకున్నారు. దీంతో తాను స్వరపరిచిన పాటను అనుమతి లేకుండా వాడుకున్నందుకుగాను ఇళయరాజా సినిమా టీమ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) , బాబు షాహిర్ , షాన్ ఆంటోనీకి ఇళయారాజా నోటీసులు పంపించారు. చట్టపరమైన హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఇళయరాజా ఆ నోటీసులో పేర్కొన్నారు.
‘గుణ’ సినిమా నిర్మాత నుండి హక్కులు పొంది ఆ పాటను వాడుకున్నాం అని చెప్పినా.. ఆ విషయం ఒక పట్టాన తేలేలా కనిపించలేదు. మరోవైపు ఈ లీగల్ సమస్యను ఎక్కువ రోజుజలు తేలకుండా ఉంటే టెక్నికల్ సమస్యలు వస్తాయని సినిమా టీమ్ మధ్యవర్తిత్వానికి వచ్చారు అని సమాచారం. ఈ క్రమంలోనే ఇళయరాజా 2 కోట్లు నష్ట పరిహారం అడిగారని టాక్ వినిపించింది. అయితే వరుస చర్చల తర్వాత రూ. 50 లక్షలు – రూ. 75 లక్షల మధ్య బేరం తెగింది అంటున్నారు.