ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయింది. ఓ గ్రౌండ్‌లో అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ను అరుపులు, కేకలతో ఉత్సాహపరిచేలా ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోకు పైన కొన్ని పేర్లు ఉంటాయి. వాటిలోంచి ఓ పేరును మీ మనసులో అనుకుంటే.. ఆ వీడియోలో అదే పేరు మీకు వినిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆ పేర్లలో లేని పేరు అనుకున్నా అదే వినిపిస్తుంది. ఇదేం మ్యాజిక్ అనుకునేరు. మన మైండ్‌కి మనమేం చెబుతామో అదే వినిపిస్తుంది అని చెప్పొచ్చు.
ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే.. ఇలా మన మైండ్‌కి మనం మనకు తోచిన పదాలు చెప్పి వాటినే మనం వినేలా చేసుకున్నాం. ఇదంతా శ్రీవిష్ణు (Sree Vishnu) లేటెస్ట్ సినిమా ‘స్వాగ్’ (Swag) గురించే. ఆ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో గత కొన్ని రోజులుగా ఓ వాదన వినిపిస్తోంది. అందులో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా అర్థం కాకుండా పెట్టేశారు అని ఆ వాదనల సారాంశం. అయితే అవి చాలామంది అనుకుంటున్న అభ్యంతరకర పదాలు కావని, అది సంస్కృతం అని తేలింది.
‘స్వాగ్’ సినిమా దర్శకుడు9 హసిత్ గోలి (Hasith Goli) ఈ విషయం మీద ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఎవరికి నచ్చినట్టుగా వారు తీసుకుంటున్నారు అని, ఏదేదో అనుకుంటున్నారు అని, అయితే అదంతా నిజం కాదని చెప్పారు. బీబీఎంలో ఉన్నవిసంస్కృత పదాలని చెప్పారు. దీంతో వాటి మీనింగ్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఆంధ్ర మహాభాగవతంలో శ్రీమన్నారాయణుడ్ని వర్ణిస్తూ పోతన రాసిన శ్లోకమదట.
‘నవ వికచ సరసిరుహ నయనయుగ.. నిజచరణ గగన చర నది జనిత’ అనే పదాలను బీజీఎంగా చేసుకున్నామని హసిత్ గోలి చెప్పారు. దీంతో ఇన్నాళ్లూ మనం వింటున్న బీజీఎం మనసులో అనుకున్న, సోషల్ మీడియా ప్రపంచంలో వాళ్లు చెప్పినవే అని తేలింది. ఇప్పుడు చెప్పండి మేం పైన చెప్పిన విషయానికి దీనికీ లింక్ ఉందా? లేదా?