హీరోలు దర్శకులు అవ్వడం కొత్త విషయమేమీ కాదు.. కానీ ఒక సినిమాకే కెరీర్ ఆపేసిన వ్యక్తి దర్శకుడు అవ్వడం అంటే ఆసక్తికరమే కదా. అందులోనూ హీరోగా చేసిన సినిమాకు, దర్శకడుగా చేస్తున్న సినిమాకు మధ్య 16 ఏళ్ల గ్యాప్ అంటే ఇంకా ఆసక్తికరం. ఇంత గ్యాప్ తీసుకొని దర్శకుడు అవుతున్న హీరో మల్లిడి వశిష్ట్. ‘బింబిసార’ సినిమాతో తొలిసారి డైరక్షన్ చేస్తున్న వశిష్ట్ గతంలో హీరోగా ఓ సినిమా చేశారు. ‘బింబిసార’ విడుదల సందర్భంగా ఆ విషయం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది.
మల్లిడి వశిష్ట్.. అసలు పేరు మల్లిడి వేణు. ప్రమఖ నిర్మాత మల్లిడి సత్యానారాయణ తనయుడు. 2006లో రచయిత కులశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో హీరోగా చేశారు. ఆ సినిమాలో అంజలి కథానాయికగా నటించింది. కులశేఖర్ లాంటి రచయిత దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఆ రోజుల్లో సినిమా మీద మంచి హైపే వచ్చింది. కానీ విడుదల తర్వాత సినిమాకు సరైన స్పందన లభించలేదు. దాంతో చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మారారు.
‘ప్రేమలేఖ రాశా’ సినిమా తర్వాత వేణు.. మరో సినిమాలో నటించడానికి ప్రయత్నాలు చేశారో లేదో తెలియదు కానీ… దర్శకుడిగా మారడానికి మాత్రం చాలా రోజుల నుండి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రవితేజ, అల్లు శిరీష్ అంటూ కొంతమంది హీరోల చుట్టూ వేణు తిరిగారు. కథ వినిపించి.. అంతా ఓకే అనుకున్నాక ఆ సినిమా ఆగిపోతూ వచ్చింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా తర్వాత ఓ పెద్ద నిర్మాణ సంస్థ మల్లి వేణుతో సినిమా అనౌన్స్ కూడా చేసింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది.
సరిగ్గా ఇదే సమయంలో వేణు కాస్త వశిష్ట్‌గా మారారు. అప్పుడు ‘బింబిసార’ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగింది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతూ ఎట్టకేలకు రేపు విడుదలవుతోంది. కల్యాణ్ రామ్‌ను తన కథతో ఒప్పించి ‘బింబిసార’గా మార్చారు. మరి హీరోగా మంచి ఫలితం అందుకోలేకపోయినా వేణు.. వశిష్ట్‌గా మారి దర్శకుడిగా మంచి ఫలితం అందుకుంటారో లేదో చూడాలి.