దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్కారు వారి పాట ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు పరశురామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గీతా గోవిందం సినిమా మొదలయ్యే నెల రోజుల ముందు తాను సర్కారు వారి పాట కథను అనుకున్నానని గీతా గోవిందం రిలీజ్ తర్వాత మహేష్ ను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి కథను సిద్ధం చేశానని పరశురామ్ తెలిపారు.
మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా కల అని ఆ కల ఈ సినిమాతో నెరవేరిందని ఆయన వెల్లడించారు. మహేష్ బాబుకు ఈ సినిమా కథ నచ్చడంతో పాటు పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా నచ్చిందని పరశురామ్ కామెంట్లు చేశారు. ఈ సినిమాలో పాత్ర, సంభాషణలు కొత్తగా ఉంటాయని మహేష్ ఈ సినిమా చేయడం వెనుక బలమైన కారణం ఇదేనని ఆయన వెల్లడించారు. సర్కారు వారి పాట వాణిజ్య వినోదంతో కూడిన కథ అని ఆయన పేర్కొన్నారు.
సినిమాలో హీరో లుక్స్ తో పాటు మహేష్ బాబు పాత్రను ఆవిష్కరించిన విధానం కొత్తగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ నాకు ఎందుకు ఇచ్చారో సినిమా చూస్తే అర్థమవుతుందని పరశురామ్ తెలిపారు. ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో థమన్ సంగీతం, సముద్రఖని నటన స్పెషల్ గా ఉంటాయని పరశురామ్ కామెంట్లు చేశారు.
అప్పుని ఆడపిల్లతో ఎందుకు పోల్చామో సినిమా చూసి తెలుసుకోవాలని పరశురామ్ వెల్లడించారు. ఈ సినిమాలో మెసేజ్ ఉండదని అయితే ఈ సినిమా బలమైన ఉద్దేశాన్ని మాత్రం చెబుతుందని పరశురామ్ పేర్కొన్నారు. బ్యాంక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ సాగినా మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంక్ ఉద్యోగిగా కనిపించరని పరశురామ్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ టాటూ వెనుక కూడా కథ ఉందని సినిమా చూసి ఆ కథను తెలుసుకోవాలని పరశురామ్ అన్నారు. పరశురామ్ తన కామెంట్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ అంటే తనకు చాలా ఇష్టమని పరశురామ్ వెల్లడించారు.