చాలా కుటుంబాల్లో ఉండే ఓ సమస్యను.. ‘సామజవగమన’ అనే సినిమాలో నవ్వుతూ, నవ్విస్తూ చూపించి మెప్పించారు దర్శకుడు రామ్ అబ్బరాజు. పెద్ద పెద్ద ఫ్యామిలీలు, రిలేషన్ల గురించి పెద్దగా తెలియని కుర్రాళ్లు.. కొత్తగా బంధుత్వం కలుస్తున్న ఇళ్లలో కొత్త తరం పిల్లలు పడే ఇబ్బందిని ఆ సినిమాలో చూపించారు. ప్రేమించుకున్నాక.. వేరే మ్యాచెస్ కుదరడం వల్ల అన్నాచెల్లెళ్లు అయ్యేవాళ్ల గురించి ఆ సినిమాలో అంతర్లీనంగా చెబుతూ వచ్చారు. దాని చుట్టూ సినిమా కథను నీట్‌గా రాసుకొని అదరగొట్టారు.
Nari Nari Naduma Murari Movie
ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ కథను అద్భుతంగా హ్యాండిల్ చేసిన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా ఈ సంక్రాంతికే విడుదలవుతోంది. శర్వానంద్ –సాక్షి వైద్య – సంయుక్త ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాను ఈ నెల 14న సాయంత్రం షోలతో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ అబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.
‘నారీ నారీ నడుమ మురారి’ పండగ చిత్రమే. తొలుత సంక్రాంతికి తీసుకురావాలని అనుకోలేదు. దసరా, దీపావళి పండగల్లో తీసుకొద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు అవ్వక సంక్రాంతికి కుదిరింది. ఈ సినిమా యూత్‌ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్. ఒకే ఆఫీస్‌లో ప్రేయసికి, మాజీ ప్రియురాలికి మధ్య నలిగిపోయే కుర్రాడి కథ ఇది. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు చాలానే వచ్చాయి. ఇందులో చెప్పే పాయింట్ ‘సామజవరగమన’ సినిమా తరహలో కొత్తగా ఉంటుంది.
అంటే రిలేషన్స్‌లో ఉన్న చిన్న తికమకలు మకతికలు ఈ సినిమాలోనూ చూపించబోతున్నారు రామ్ అబ్బరాజు. మరి ఆయన టైప్ కామెడీని, ఎమోషన్స్‌ని శర్వానంద్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. చూద్దాం మరి ఎంతో కాన్ఫిడెంట్‌గా సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.