పెళ్లి చూపులు వంటి కథని నమ్మి నిర్మించి ఉత్తమ అభిరుచి కలిగిన నిర్మాతగా రాజ్ కందుకూరి పేరు అందుకున్నారు. అతను నిర్మించిన రెండో సినిమా “మెంటల్ మదిలో”. ఈ చిత్రం నేడు (శుక్రవారం) రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి అనేక సంగతులు పంచుకున్నారు. “పెళ్లి చూపులు విడుదలైన తరువాత షార్ట్ ఫిల్మ్స్ చేసిన చాలామంది నా దగ్గరికి వచ్చి కథలను వినిపిస్తూ ఉండేవారు. అలా ఒక రోజున వివేక్ ఆత్రేయ తన దగ్గర ఓ కథ ఉందంటూ వచ్చాడు.
ఇద్దరం కాఫీ షాప్ లో కూర్చున్నాం. పొయెటిక్ ఫీలింగ్ తెచ్చే ‘కావ్యం’ అనే ఓ కథ చెప్పాడు. అంతటి భావుకతను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు. ఇప్పట్లో ఈ సినిమా చేయలేనన్నాను. అలా వెళ్లిపోయిన వివేక్ ఆత్రేయ వారం రోజుల తరువాత మరో కథ వుందని చెబితే రమ్మని చెప్పాను. చేతిలో ఎలాంటి స్క్రిప్ట్ లేదు. చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఆపేసి… మర్నాడు మళ్లీ అదే సమయానికి రమ్మన్నాను. ఈ లోగా ఆ తరువాత ఏం జరిగి వుంటుందోనని ఆలోచించుకున్నాను. మర్నాడు వచ్చి మిగతా కథ వినిపించాడు. అక్కడే ఆయనతో ఓ సెల్ఫీ తీసుకుని .. నా నెక్స్ట్ డైరెక్టర్ అని పోస్ట్ చేశాను .. అంతే” అంటూ “మెంటల్ మదిలో” కథ వెనుక స్టోరీని వివరించారు. శ్రీ విష్ణు, నివేథ పెతురాజ్ లు తమ నటనతో కథకు న్యాయం చేశారు. అందరూ కొత్తవారు అయినప్పటికీ మంచి మూవీని అందించారు.