ఓటీటీ పెనుగుండం నుంచి బయటపడకముందే, ఇండియన్ సినిమా (Indian Cinema) ఇండస్ట్రీకి మరో అడ్డంకిగా ఐపీఎల్ రూపంలో మరో సీజన్ ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఐపీఎల్ మ్యాచ్‌లున్న రోజుల్లో థియేటర్లు బోసిపోయినట్టే ఉంటాయి. క్రికెట్ పండుగలా మారిన ఈ లీగ్ వల్ల సినిమాలపై భారీ ప్రభావం పడుతోంది. స్పెషల్‌గా వీకెండ్లలో వచ్చే హై వోల్టేజ్ మ్యాచ్‌ల వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ పూర్తిగా ఇంటికే పరిమితం అవుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభమై మే చివరి వారం వరకు కొనసాగుతుంది.
దాంతో సినిమాలు విడుదల చేయాలనుకునే నిర్మాతలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలుచోట్ల భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా వేయడం మొదలైంది. కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాకీగా ఉందని ప్రకటించాయి కానీ అసలు కారణం ఐపీఎల్‌నే అన్నది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ప్రభాస్ (Prabhas) నటించిన “రాజాసాబ్” (The Rajasaab) సినిమా వాయిదాపై కూడా ఇదే కారణంగా ఊహాగానాలు వస్తున్నాయి.
ఇక ఏప్రిల్, మే నెలల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేసిన సినిమాలు తక్కువగానే ఉన్నాయి. తమిళనాడు, కేరళలోనూ సినిమాల విడుదలలు తగ్గిపోతున్నాయి. ఇది సౌత్ ఇండస్ట్రీలపై ఐపీఎల్ ప్రభావాన్ని సూచిస్తుంది. ఎక్కడ చూసినా క్రికెట్ హంగామా, స్టార్ల ప్రమోషన్లు, సోషల్ మీడియా ట్రెండింగ్.. అందరి ఫోకస్ ఐపీఎల్ పైనే. ఈ నేపధ్యంలో ప్రేక్షకుల దృష్టిని సినిమాలవైపు తిప్పడం ఓ సవాలుగా మారింది.
ఇప్పటికే అనుష్క (Anushka Shetty) నటించిన ఓ సినిమాను విడుదల వాయిదా వేయడంతో పాటు, మరో మలయాళ స్టార్ మూవీ కూడా అకస్మాత్తుగా తారీఖు మార్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణం ఎలాగూ స్పష్టమే. కనుక ఈ రెండు నెలలు సినిమాలను విడుదల చేయడం కంటే.. వాయిదా వేసి, సరైన టైమ్‌లో విడుదల చేయడం నిర్మాతలకు లాభదాయకమని బాక్సాఫీస్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.