‘యువత తమ విలువైన సమయాన్ని బెట్టింగ్ యాప్స్ వల్ల వృథా చేసుకుంటున్నారు. రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనుకపడటానికి ఇదొక కారణం.. అందుకే ఈ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేయబోతున్నాం’ అంటూ హోలీకి ముందు రోజు సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సజ్జనార్ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టే.. కొంతమంది సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది.
ఈ లిస్టులో అనన్య నాగళ్ళ (Ananya Nagalla) పేరు కూడా ఉంది. అయితే ‘బెట్టింగ్ వ్యాపారాన్ని నడిపే వాళ్ళని పట్టుకోవడం, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం మానేసి.. దానిని ప్రమోట్ చేసినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి?’ అంటూ నటీనటులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనన్య నాగళ్ళ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పెద్ద పెట్టున వైరల్ అవుతుంది. మెట్రో స్టేషన్లో తీసిన ఈ ఫోటోని గమనిస్తే.. ఇందులో ఓ మెట్రో ట్రైన్ పై బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ కవర్ చేశారు.
ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నాము అని.. ప్రభుత్వానికే తెలియకపోతే.. మిగిలిన వాళ్లకు ఎలా తెలుస్తుంది?’ అంటూ అనన్య నాగళ్ళ ప్రశ్నించింది. నిజమే ఆమె లాగిన పాయింట్ కూడా మంచిదే. మెట్రోని నడుపుతుంది కూడా ప్రభుత్వమే కాబట్టి.. దీనిపై బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ కవర్ ఉండటం ఏంటి? అందుకే అనన్య నాగళ్ళకి కొంతమంది నెటిజెన్లు మద్దతు పలకడం మొదలుపెట్టారు.