బాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమా వస్తోందా? అయితే బాయ్‌కాట్ ట్రెండ్ షురూ చేయండి.. అన్నట్లుగా తయారైంది హిందీ సినిమా పరిస్థితి. సినిమాలో ఏముంది, ఏం కథ చెప్పబోతున్నారు, ఏం చేశారు? అనేది కూడా చూడకుండా పోస్టర్ చూసో, పేరు చూసో, డ్రెస్‌లు రంగు చూసో ‘బాయ్‌కాట్‌ట్‌ట్’ అంటూ అరిచేస్తున్నారు. అలాంటి అరుపుల మధ్య ఎంతో ఓపికగా వచ్చాడు ‘పఠాన్’. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌తో ‘పఠాన్’ సినిమా మీద నెగిటివిటీ తగ్గుతుందా అనేది నేటి ప్రశ్న.
షారుఖ్ ఖాన్ తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ‘జీరో’ సినిమా నుండి బాలీవుడ్ కింగ్ ఖాన్ పరిస్థితి ఏ మాత్రం బాలేదు. ఆ సినిమా దారుణ పరాజయం చాలా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు ఇంకా కలవరపరిచాయి. ఆ సమయంలోనే ‘పఠాన్’ అంటూ ప్రకటించారు. చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘పఠాన్’ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. అయితే ఈ సినిమా మీద భారీ స్థాయిలో నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది. దానంతటికి కారణం హీరోయిన్ దుస్తులే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
‘భేషరమ్ రంగ్..’ పాటలో సినిమా కథానాయిక దీపికా పడుకొణె వేసుకున్న దుస్తుల రంగు విషయంలో ఓ వర్గం ప్రేక్షకులు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత సెన్సార్ దగ్గర కూడా ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి అంటున్నారు. అయితే టీమ్ వాటిని ఫిక్స్ చేసుకుని సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇదంతా ఓ పక్క అయితే.. సినిమాలో దేశాన్ని రక్షించే సైనికుడిలా షారుఖ్ ఖాన్ కనిపించడం ప్రేక్షకులను ఏమన్నా కూల్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది.
దేశభక్తి, హిందూ ప్రో సినిమాలు వస్తే నెత్తిన పెట్టుకుని చూసుకునే ఓ వర్గమే మొన్నీమధ్య వరకు ‘పఠాన్’ సినిమాను దుమ్మెత్తిపోశాయి అని అంటున్నారు నెటిజన్లు. కాబట్టి ఇప్పుడు వాళ్లే ఈ సినిమాను తిరిగి భుజానికెత్తుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమాను తక్కువ చేశాం అనే మాట వాళ్లే పడాల్సి వస్తుంది మరి. దీంతో నెగిటివిటీ ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది అంటున్నారు పరిశీలకులు.