అదే మెగా ఫ్యామిలీ తప్పా.. విమర్శలపై టాలీవుడ్‌ మౌనానికి కారణమిదేనా?

మేమంతా ఒకటే.. మాలో ఎవరిని, ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదు అంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో ఒకొక్కరు అక్షరాలను బాణాలుగా మార్చి సంధిస్తున్నారు. దానికి వారి అభిమానుల నుండి తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నుండి స్పందన కూడా బాగుంది. టాలీవుడ్‌లో ఇలాంటి యూనిటీ ఉంటుంది అని ఊహించని వారు, ఎప్పుడూ చూడని వారు ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో ఓ ప్రశ్న కూడా వస్తోంది. అదే మీరు చూపిస్తున్న ఆగ్రహం, ప్రేమ, అభిమానం గతంలో ఎక్కడకు వెళ్లిపోయాయి అని.

ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఇలానే అవమానకరమైన మాటలు ఎదుర్కొన్నప్పుడు ఎందుకు ఎవరూ స్పందించలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. చాలా సందర్భాల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్ విషయంలో విమర్శలు వస్తే వాళ్లే ఎదుర్కొన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు. చిరంజీవిని, పవన్‌ను ఎవరు ఎప్పుడు ఏం అన్నారు విషయాలు ఇప్పుడు అప్రస్తుతం. కానీ విషయం సీరియస్‌నెస్‌ చెప్పడానికి ఆ అంశాలు ప్రస్తావించాల్సి వస్తోంది.

చిరంజీవి చిన్న కూతురు వివాహం, ఉదయ్‌ కిరణ్‌ వ్యవహారం.. ఇలానే చాలానే ఉన్నాయి. ఇక పవన్‌ విషయంలో అయితే ఏం జరిగిందో తెలుసుకోకుండా పెళ్లిళ్ల గురించి రాజకీయ పక్షాలు చాలానే మాట్లాడాయి.అప్పుడు ఒక్కసారి కూడా సినిమా పరిశ్రమ నుంచి ఇప్పుడు వచ్చినంత ప్రతిఘటన ఎదురుకాలేదు. కనీసం ఆ విషయం విననట్లే ఊరుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక్కడ నాగార్జున విషయంలో సినీ తారలు అలా స్పందించడం తప్పు అని ఎవరూ అనడం లేదు. అయితే గతంలో ఏమైంది ఈ చైతన్యం అనేదే ప్రశ్న.

అయితే, దీనంతటికి కారణం వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడమేనా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లిపోయారు కదా.. ఇక విమర్శలు కామన్‌. మనం వదిలేయొచ్చు అని అనుకున్నారా? అని చెవులు కొరుక్కుంటున్నారు టాలీవుడ్‌ ఫ్యాన్స్‌. అయితే తమ విషయంలో పట్టించుకోని చిత్ర పరిశ్రమ కోసం, పరిశ్రమలోని నటుల కోసం మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంది. ఇప్పుడు నాగార్జున కుటుంబం విషయంలో విమర్శలు వస్తే ముందుండి స్పందించింది అని గుర్తు చేస్తున్నారు. చూద్దాం ఇకనైనా టాలీవుడ్‌ జనాలు.. మెగా ఫ్యామిలీ విషయంలో ఏమన్నా ఇబ్బంది వస్తే స్పందిస్తారేమో.

పవన్‌ అసలు పేరు మనం అనుకుంటున్నది కాదు.. ఇంకొకటి ఉంది తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus