రాజమౌళితో సినిమా అంటే ఫ్యామిలీ ప్యాకేజీ అంటారు. అంటే ఆయన సినిమా అంటే ఆయన కుటుంబం సినిమా అని చెప్పాలి. దర్శకత్వం ఆయన చేస్తే… మిగిలిన కుటుంబ సభ్యులు ఒక్కో కీలకమైన క్రాఫ్ట్ తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఇక మహేష్ బాబుతో సినిమా అంటే రెమ్యూనరేషన్ లెక్కలు ఓ లెవల్‌లో ఉంటాయి అని చెప్పాలి. అయితే వసూళ్లు కూడా అంతేలా ఉంటాయి అనుకోండి. అయితే ఈ ఇద్దరూ రెమ్యూనరేషన్ తీసుకోకుండా #SSMB29 చేస్తున్నారా? ఏమో దీని గురించే చర్చ నడుస్తోంది టాలీవుడ్‌లో.
‘గుంటూరు కారం’ పని పూర్తి చేసి, రిలీజ్ చేసేసి తర్వాతి సినిమా పనుల్లో పడ్డాడు మహేష్. దీని కోసం విదేశాలకు వెళ్లి మరీ అప్పుడే సన్నాహకాలు చేస్తున్నారు. ఆయన తిరిగి స్వదేశానికి వచ్చేలోపు దర్శకుడు రాజమౌళి ప్రి ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి తీసుకొస్తారట. ఈ ప్రాజెక్ట్ ఉగాదికి లాంఛనంగా ప్రారంభం అవుతుంది అని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు సమ్మర్ తర్వాత సినిమా షూటింగ్ మొదలవుతుంది అని కూడా చెబుతున్నారు. ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమా పారితోషికాల విషయంలో ఓ అవగాహనకు వచ్చేశారట.
సుమారు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సినిమా కాబట్టి బ్లాక్‌బస్టర్ విజయం పక్కా. వసూళ్ల లెక్కలు ఓ లెవల్‌లో ఉంటాయి. అందుకే రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకుందామని రాజమౌళి, మహేష్ అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేదంటే అధికారిక సమాచారం లేదు కానీ… ఇదే జరుగుతుంది అని సన్నిహిత వర్గాల సమాచారం.
#SSMB29 అడ్వెంచర్ మూవీగా రూపొందనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. హనుమంతుడి నుండి ప్రేరణ పొందిన పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నట్లు కూడా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ అని ఓ పుకారు వండివార్చారు. అయితే ఎందులోనూ క్లారిటీ లేదు. కానీ సినిమా మొదలైన కొద్ది రోజులకే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పడం జక్కన్నకు అలవాటు. కాబట్టి అప్పటివరకు వెయిట్ చేస్తే సరి.