హీరోయిన్ ఓరియెంటడ్ మూవీ… టాలీవుడ్‌లో ఇలాంటి మాట విని చాలా రోజులు అయింది. గతంలో తరచుగా వినిపించే ఈ పేరు ఇప్పుడు తక్కువగా వినిపిస్తోంది. అలాంటి సినిమాలు చేసే నాయికలు తగ్గడం, చేసినా సరైన ఫలితాలు లేకపోవడం ఓ కారణం అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఓ సమస్య గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అదే ఈ సినిమాల్లో హీరో ఎవరు అని. అంటే మరీ కొత్తవాళ్లు స్టార్ హీరోయిన్ల పక్కన బాగోరు.. అలా అని స్టార్ హీరోలు ఈ పాత్రల కోసం ముందుకురారు.
అయితే అలాంటి హీరో దొరికాడా? టాలీవుడ్‌లో ఇటీవల రూపొందిన, రూపొందుతున్న సినిమాలు చూస్తే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘శాకుంతలం’ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే హీరో మరో సినిమా ఓకే చేశాడు.. అదే ‘రెయిన్ బో’. సమంత ‘హీరో’యిన్‌గా చేసిన ‘శాకుంతలం’లో దేవ్‌మోహన్ హీరో అనే విషయం తెలిసిందే. ఇప్పుడు రష్మిక మందన సినిమాలోనూ ఆయన్నే తీసుకున్నారు.
దీంతో ‘హీరో’యిన్లకు (Heroine) ఆయనే హీరో అంటున్నారు. నిజానికి ‘శాకుంతలం’ సమయంలో, ఇప్పుడు ‘రెయిన్ బో’ సమయంలో వేరే తెలుగు కుర్ర హీరో గురించి చూశారట. కానీ ఎవరూ సెట్ అవ్వలేదు అంటున్నారు. అయితే టీమ్స్ మాత్రం దేవ్ మోహన్ అయితేనే ఆ పాత్రలకు బాగుంటాడని, అందుకే అతనని తీసుకున్నామని చెబుతున్నాయి. తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోగా చేస్తే మళ్లీ సరైన అవకాశాలు రావు అనే అపవాదు ఉంది.
దీంతోనే తెలుగు హీరోలు వెనక్కి మళ్లుతున్నారని చెబుతున్నారు. గతంలోనూ ఇలా లేడీ ఓరియెంటడ్ సినిమాల్లో హీరో అంటే.. ఉన్ని ముకుందన్ గుర్తొచ్చేవాడు. ‘భాగమతి’, ‘యశోద’ సినిమాల్లో ఇలాంటి పాత్రలే చేశాడు. ఇప్పుడు దేవ్ మోహన్ కూడా ఇలాంటి పాత్రలకే అనుకుంటే కష్టమే. మరి ఇలాంటి సినిమాలే అనే మచ్చ పడితే ఏం చేస్తాడు అనేది చూడాలి.