సీనియర్ నటి జమున అనారోగ్యంతో ఇటీవల హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సీనియర్ నటులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సినీ పరిశ్రమ మరియు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఫిలించాంబర్‌లో ఉంచారు. తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపారు. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా జమున మృతికి సంతాపం తెలియజేశారు. అయితే టాలీవుడ్ అలనాటి నటి జమునకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ సినీ ప్రియులు నెట్టింట పోస్టుల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
తనకెంతో ఇష్టమైన కళారంగం కోసం ఎంతో చేసిన జమునకు తెలుగు పరిశ్రమ, ప్రభుత్వం కనీసం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు కూడా జరపలేదు.. చివరి చూపుకి నోచుకోలేని వారు నివాళులర్పించడానికి సంతాప సభ లాంటిది కూడా ఏర్పాటు చేయలేదు అంటూ బాధపడుతున్నారు. ‘‘జమున తెలుగునాట సినిమా రంగం అభివృద్ధి కోసం చెన్నపట్నంలోని ఇల్లుతో సహా అమ్మి భాగ్యనగరానికి విచ్చేశారు.. అలాంటామెకు మనవాళ్లు ఇచ్చే గౌరవం ఇదేనా?.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా భాగ్యనగరంలో షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రం ‘మా ఇంటి మహాలక్ష్మీ’ (1959) ఆమె నటించినదే..
అదే జమున గారు చెన్నపట్నంలో ఉండి ఉంటే గొప్పగా సాగనంపి ఉండేవారు. మర్యాద ఇవ్వడం కూడా వారి కులము, ఓటు బ్యాంకు చూసి ఇచ్చే రాజకీయాలు తెలుగునాట’’ అంటూ జమున మరియు తెలుగు సినిమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాట జమున బయోపిక్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తమన్నా, జమున పాత్రలో నటించనుందని అంటున్నారు.
జమున నట జీవితంలో జరిగిన పరిణామాలు, ఆ ఇబ్బందులను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న తీరు, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన క్రమం అంతా ఓ సినిమాకు కావాల్సిన నాటకీయతను అందిస్తాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మహానటి సావిత్రితో పోల్చుకోదగిన సమకాలీకురాలైన జమున జీవిత కథా చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
తెలుగునాట సినిమా రంగం అభివృద్ధి కోసం చెన్నపట్నంలో ఇల్లుతో సహా అమ్మి భాగ్యనగరానికి విచ్చేశారు #జమున గారూ.
ఏమిచ్చారు మనవాళ్ళు? కనీసం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు కూడా జరపలేని దుష్ట ప్రభుత్వాలు.