చిరంజీవిని (Chiranjeevi) ఇప్పటివరకు చూడని విధంగా చూపించబోతున్నా అంటూ దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) చెబుతూ వస్తున్నారు. అందరు దర్శకులు ఇలానే చెబుతుంటారు కదా.. అంత కొత్తగా ఏం చూపిస్తారు అనే మాట కూడా వినిపిస్తూ వచ్చింది. అయితే దసరా సందర్భంగా విశ్వంభర (Vishwambhara) టీజర్‌ను రిలీజ్ చేసి ‘ఇదిగో ఇలా’ అంటూ తన ఆలోచన, చూపించబోతున్నా అనే విషయంలో రుచి చూపించారు. ఈ క్రమంలో సినిమా కథ ఇదేనా? అంటూ ఓ డౌట్ మొదలైంది.
చిరంజీవి కథానాయకుడిగా త్రిష (Trisha) , ఆశికా రంగనాథ్ (Ashika Ranganath) కథానాయికలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ‘బింబిసార’ (Bimbisara) , సినిమాతో అదిరిపోయే విజయం అందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొండ నుండి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మెప్పించిన వశిష్ట. ఇప్పుడు టీజర్‌లో చిరంజీవిని రెక్కల గుర్రం ఎక్కించారు.
ఈ క్రమంలో చూపించిన కొన్ని సన్నివేశాలను కలుపుకుంటే కథ విషయంలో క్లూలు దొరుకుతున్నాయి. కావాలంటే మరోసారి చూడండి మీకు కూడా దొరుకుతాయి కొన్ని విషయాలు. సినిమాలో చిరంజీవి ఏదో అవసరం మేరకు మంచు పర్వతాలకు వెళ్తారు. మహిమాన్వితమైన ఆ మంచు పర్వాతాల్లో ఓ దుష్టశక్తి ఉంటుంది. గతంలో ఆ దుష్టుడితో పోరాడి ఓ యోధుడు తుది శ్వాస విడుస్తాడు. అయితే అతను తిరిగి వస్తాడని ఆయన అనుచరులు నమ్ముతారు. అయితే, ఆ యోధుడు భీమవరం దొరబాబు అదే రూపంలో చూసి ఆశ్చర్యపోతారు.
ఓ కారణంతో అక్కడకు వచ్చిన అతను ఏం చేశాడు? అసలు ఆ దుష్టశక్తి ఎవరు అనేదే సినిమా కథ అని అర్థమవుతోంది. అయితే టీజర్ చూసి సినిమా కథ చెప్పేయడం సరికాదు కానీ.. ఇప్పటివరకు అనిపిస్తున్న పాయింట్లు, కథ ఇవే. చూద్దాం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. మామూలుగా అయితే సంక్రాంతికి సినిమా వస్తుంది అంటే డిసెంబరులో ట్రైలర్ వచ్చేది. కానీ ఇప్పుడు సినిమా సంక్రాంతికి రావడం లేదుగా.