కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో 3 నెలలుగా మూతపడిన థియేటర్లు నిన్న అంటే జూలై 30న తెరుచుకున్నాయి. సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజ సజ్జల ‘ఇష్క్’ చిత్రాలతో పాటు మరో 3 చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ‘థియేటర్లు ఓపెన్ అవుతున్నాయోచ్’ అంటూ సంబరపడిపోయి సోషల్ మీడియాలో హడావిడి చేసిన జనాలు థియేటర్లకు అయితే రాలేదు. ఉన్నంతలో ‘ఇష్క్’ ‘తిమ్మరుసు’ సినిమాలు ఓకే అనిపించాయి. అయితే వీటికి కూడా భారీగా ఓపెనింగ్స్ అయితే రాలేదు.
‘గుడ్డితో పోలిస్తే మెల్ల మేలు’ అనే విధంగా వచ్చాయి. హిట్ టాక్ తెచ్చుకున్న ‘తిమ్మరుసు’ కి అవే ఓపెనింగ్స్.. ప్లాప్ టాక్ మూటకట్టుకున్న ‘ఇష్క్’ కు అవే ఓపెనింగ్స్. ‘తిమ్మరుసు’ చిత్రానికి రూ.15 లక్షల వరకు షేర్ నమోదయ్యింది. ఇక ‘ఇష్క్’ చిత్రానికి రూ.14 లక్షల షేర్ నమోదయ్యింది. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు రన్ అవుతున్నా.. కనీసం ఈ సినిమాలకి ఒక్క షో కూడా హౌస్ ఫుల్ పడకపోవడం దారుణమైన విషయం.
ఇక మిగిలిన 3 సినిమాలు కనీసం షోలు కూడా పడలేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ‘కరోనా భయం జనాల్లో పోలేదా? లేక చిన్న సినిమాలు కదా అని లైట్ తీసుకున్నారా?’ అనే విషయం అర్ధంకాక థియేటర్ యాజమాన్యాలు తలకొట్టుకుంటున్నాయి. ఆగష్ట్ 6న ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ రిలీజ్ అవుతుంది. మరి దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి..!