“ముద్దు” అనే పదంలోని మాధుర్యం రోజురోజుకీ దిగజారిపోతోంది, ఆ మాధుర్యం బదులుగా లేకితనం వచ్చి చేరుతుంది. అరె ఇలా ముద్దు పెట్టుకొంటారా అని కొన్ని సినిమాలు చూసి ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు.. ఇప్పుడు వస్తున్న సినిమాల్లోని పోస్టర్స్ మరియు ప్రోమోస్ లో ముద్దులు చూసి మాత్రం అసహ్యపడుతున్నారు. ఈ ముద్దులేంట్రా బాబు అని భయపడుతున్నారు. ముఖ్యంగా.. “అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100” లాంటి సినిమాలు ఆ తరహా పోస్టర్స్ తో జనాల్ని ఎట్రాక్ట్ చేసి హిట్ కొట్టినప్పట్నుంచి ఈ ముద్దు పోస్టర్ల హల్ చల్ మరీ పెరిగిపోయింది.
ఈ శుక్రవారం విడుదలవుతున్న “ఇష్టంగా” అనే సినిమా పోస్టర్స్ ఫిలిమ్ నగర్ లో రచ్చ చేస్తున్నాయి. హీరోహీరోయిన్లు ఆత్రంగా ముద్దులాడుకొంటున్న పోస్టర్స్ ను జనాలు ఆశగా చూడడం లేదు.. ఇబ్బందిపడుతున్నారు. పైగా.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా హీరోహీరోయిన్లు ముద్దుపెట్టుకొంటున్న వీడియోలు రిలీజ్ చేసి.. “లాంగెస్ట్ కిస్ ఇన్ టి.ఎఫ్.ఐ” అని ప్రమోట్ చేయడం అనేది దిగజారుడుతనమా లేక మరింకేదైనా అనేది దర్శకనిర్మాతలకే తెలియాలి. విడుదలైన తర్వాత ఈ సినిమాను ఎంత మంది చూస్తారు అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం ఆ సినిమా పోస్టర్స్ చూసి మాత్రం ఈసడించుకొంటున్నారు.