Homebound: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా మీద కాపీ మరకలు.. నిర్మాణ సంస్థ ఏమందంటే?

మన దేశం తరఫున ఆస్కార్‌ – 2026లో పోటీపడుతోన్న ‘హోమ్‌బౌండ్‌’ సినమాపై ఓ రచయిత్రి సంచలన ఆరోపణలు చేశారు. తన నవలను కాపీ కొట్టి ఈ సినిమాను తెరకెక్కించారు అనేది ఆమె ఆరోపణ. ఈ విషయంలో దర్శక నిర్మాతలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పడం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాను 2021లో రాసిన ‘హోమ్‌బౌండ్‌’ అనే నవలనే ఇప్పుడు సినిమాగా తీశారనేది రచయిత్రి పూజా చంగోయివాలా ఆరోపణ.

Homebound

సినిమా టైటిల్‌ దగ్గర నుండి, పాత్రల వరకూ అన్నీ తన నవలనే పోలి ఉన్నాయని పూజా చంగోయివాలా అంటున్నారు. ఈ విషయంలో అక్టోబర్‌ 15న నిర్మాణ సంస్థకు లీగల్‌ నోటీసులు జారీ చేశానని కూడా చెప్పారు. అయితే ఇప్పటివరకు సినిమా టీమ్‌ స్పందించలేదని ఆమె చెప్పారు. దీంతో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై నిర్మాణసంస్థ స్పందించింది. ‘‘ఈ విషయంలో మేం చట్టపరంగానే సమాధానమిస్తాం. ఇప్పుడు దీని గురించి ఎలాంటి కామెంట్స్‌ చేయలేం’ అని తేల్చేసింది.

నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది కాన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ సందర్భంగా చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాను 2020లో న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక ఆర్టికల్‌ ఆధారంగా రూపొందించినట్లు తెలిపింది. ఇక టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండో రన్నరప్‌గా ఇంటర్నేషనల్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఆస్కార్‌ కోసం షార్ట్‌లిస్ట్‌లోనూ స్థానం సొంతం చేసుకుంది.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. పోలీసు కావాలనే తమ కలను సాధించే ప్రయత్నంలో కుల, మత వివక్షకు వ్యతిరేకంగా ఇద్దరు స్నేహితులు మహ్మద్‌ షోయబ్‌ (ఇషాన్‌ ఖట్టర్‌), చందన్‌ కుమార్‌ వాల్మీకీ (విశాల్‌ జెత్వా) చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. దీని కోసం వారేం చేశారు, వీరికి సుధా భారతి (జాన్వీ కపూర్‌)కి సంబంధం ఏంటి అనేదే సినిమా. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

 పెద్ద ‘బాహుబలి’ ఇప్పుడు చిన్న తెర మీదకు.. స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus