తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదాయ పన్ను శాఖ దాడులు (IT Raids) సంచలనం రేపుతున్నాయి. ఈసారి బడా నిర్మాణ సంస్థలపై మాత్రమే కాకుండా, ప్రముఖ హీరోల ఆర్థిక లావాదేవీలు కూడా ఐటీ నిఘాలోకి వచ్చాయి. పెద్ద బ్యానర్ల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్న హీరోలు, వాటి లావాదేవీలు పన్ను చట్టాలకు లోబడే జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్లు కూడా ఆకాశాన్నంటాయి.
పాన్ ఇండియా స్టార్‌లు ఒక్కో సినిమా కోసం 100 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుండగా, మీడియం రేంజ్ హీరోలు 15 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మొత్తం మొత్తంలో కొంత భాగం బ్యాంక్ లావాదేవీలుగా నమోదవుతుండగా, మిగతా మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, క్యాష్ లావాదేవీలు నిబంధనలకు వ్యతిరేకమని ఐటీ అధికారులు (IT Raids) భావిస్తున్నారు.
పన్ను ఎగవేతకు సంబంధించి చెల్లించిన మొత్తం, హీరోలు అందుకున్న రశీదులు, వాటి వెనుక ఉన్న డాక్యుమెంటేషన్ విషయంలో అధికారులు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు విరుద్ధంగా జరిగే లావాదేవీలు పరిశ్రమ నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడుల కారణంగా ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు తమ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నిర్మాణ సంస్థలు తమ కాంట్రాక్టులను స్పష్టమైన విధానాలతో నిర్మించడమే కాకుండా, బ్యాంకింగ్ చట్టాలకు లోబడే లావాదేవీలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మొత్తానికి, టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఐటీ దాడులు పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న పరిశ్రమకు పారదర్శకత అవసరమేనని ప్రత్యేకంగా పలువురు ప్రముఖులు చెబుతున్నారు.