దర్శకుడిగా ధనుష్ (Dhanush) తన మూడో ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం “జాబిలమ్మ నీకు అంత కోపమా” (Jaabilamma Neeku Antha Kopama). నిజానికి ఈ సినిమాను తానే హీరోగా అనౌన్స్ చేసినప్పటికీ.. అనంతరం తన అక్క కొడుకు పవిష్ హీరోగా అదే ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. జెన్ జీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలోని ‘గోల్డెన్ స్పారో” పాట ఆల్రెడీ అందరినీ విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ట్రైలర్ కూడా బాగుండడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యాయి. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: ఫస్ట్ లవ్ నీల (అనిఖ సురేంద్రన్)తో బ్రేకప్ అనంతరం ఆమెను మర్చిపోలేక బాధపడుతున్న ప్రభు (పవిష్)కు పెళ్లి చేద్దామని, అతడి తల్లిదండ్రులు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. కట్ చేస్తే.. అక్కడ కలిసేది ప్రభు స్కూల్ మెట్ (ప్రియ ప్రకాష్ వారియర్). ఆమెకు దగ్గరవుతున్న క్రమంలో నీల పెళ్లి కార్డ్ రావడంతో, ఆమె పెళ్లికి స్నేహితుడు కార్తీక్ (మాథ్యూ థామస్)తో కలిసి గోవా వెళ్తాడు ప్రభు.
గోవా వెళ్లిన ప్రభు అక్కడ తన ఎక్స్ నీల పెళ్లి వేడుకను చూస్తూ ఉండగలిగాడా? ఈ ప్రేమకథలో చివరికి ఏ తీరానికి చేరింది? అనేది “జాబిలమ్మ నీకు అంత కోపమా” కథాంశం.
నటీనటుల పనితీరు: పవిష్ ను చూస్తే ఇది అతడి మొదటి సినిమా అని అస్సలు అనిపించదు. చాలా నేచురల్ గా, మంచి టైమింగ్ తో ప్రభు పాత్రలో అదరగొట్టాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. చాలా సన్నివేశాల్లో జూనియర్ ధనుష్ లాగానే ఉన్నాడు. నటుడిగా మంచి భవిష్యత్ ఉంది.
పవిష్ తర్వాత అదే స్థాయిలో అలరించిన నటుడు మాథ్యూ థామస్. అతడి కామెడీ టైమింగ్ చాలా రిలేటబుల్ గా ఉంది. పంచ్ లు చిన్నవే అయినా హిలేరియస్ గా పేలాయి. ఓ రెగ్యులర్ హీరో ఫ్రెండ్ రోల్ కి భిన్నంగా, దాదాపుగా సినిమా మొత్తం ఉంటాడు.
అనిఖ సురేంద్రన్ చూడ్డానికి అందంగా కనిపించినప్పటికీ.. నటిగా మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా తేలిపోయింది.
రబియా అందంగా కనిపించడమే కాక మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. ప్రియ ప్రకాష్ వారియర్, రమ్య రంగనాథన్ సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించారు. శరత్ కుమార్ ను కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి కొత్త ఫీల్ తీసుకొచ్చింది. బ్రైట్ లైట్ వాడకపోవడం, కలర్ టోన్ ను సింపుల్ గా ఉంచడం వల్ల కొద్దిగా వెస్ట్రన్ సినిమాల ఫీల్ ను ఇస్తూనే.. సినిమాలోని ఎమోషన్ నీట్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది.
జీవి ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతం ట్రెండీగా ఉన్నాయి. ముఖ్యంగా.. సినిమాలో ఇళయరాజా పాటల్ని వినియోగించిన విధానం & టైమింగ్ మంచి ఫీల్ ఇచ్చాయి. పాటల్ని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. సీజీ & సెట్ వర్క్ నవతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
దర్శకుడు ధనుష్ నవతరం, మరీ ముఖ్యంగా జెన్ జీ లవ్ & లైఫ్ స్టైల్ ను అర్థం చేసుకొని, ప్రెజెంట్ చేసిన తీరు యూత్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా.. ప్రేమలోని అమాయకత్వాన్ని, బాధను మాత్రమే ఎక్స్ ప్లోర్ చేస్తూ కథనాన్ని నడిపించిన విధానం బాగుంది. అలాగే మాథ్యూ థామస్ పాత్రతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించిన విధానం ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. సినిమాలో చాలా రిలేటబుల్ అంశాలున్నాయి. అలాగే.. సినిమాని ముగించిన విధానం కూడా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడిగా మూడో సినిమాతోనూ ధనుష్ మంచి విజయం సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.
విశ్లేషణ: నవతరం ప్రేమకథల్ని ఇప్పటివరకు చాలామంది దర్శకులు, ముఖ్యంగా యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. ఎక్కువమంది అందులో శృతి మించిన శృంగారాన్ని ఇరికించడానికి ప్రయత్నించి, యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అంటేనే బోర్ కొట్టించేశారు. అలాంటిది ధనుష్ కరెంట్ జనరేషన్ యూత్ & వాళ్ల ప్రేమ కోణాన్ని బాగా అర్థం చేసుకొని “జాబిలమ్మ నీకు అంత కోపమా” చిత్రాన్ని ఆరోగ్యకరమైన హాస్యభరిత ప్రేమకథగా రూపొందించిన తీరు కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ఫోకస్ పాయింట్: యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్!
రేటింగ్: 3/5