జబర్దస్త్ కమెడియన్లు తరచుగా తమలోని కొత్త టాలెంట్స్ ను బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వేణు ఎల్దండి (Venu Yeldandi) ‘బలగం’ (Balagam) తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. కమర్షియల్ గా ఎలా ఉన్నా.. ‘వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా’ అనేలా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా వచ్చేదాకా అతనిలో ఆ టాలెంట్ ఉందని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఇతని కంటే ముందు ధనరాజ్ (Dhanraj) కూడా ఓ మూవీ డైరెక్ట్ చేసి వావ్ అనిపించాడు.
ఇప్పుడు మరొక జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్‌గా మారాడు. అతను మరెవరో కాదు ఫన్నీ పంచులతో అదరగొట్టే అదిరే అభి (Adhire Abhi). అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి ప్రస్తుతం మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ అయిన ‘చిరంజీవ’కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ వచ్చే నెల ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి మాట్లాడుతూ…”చిన్నప్పటి నుంచి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం.
డైరెక్టర్ అవ్వాలనే యాక్టింగ్ కెరీర్ ఎంచుకున్నా. మొదట నటుడిగా ఛాన్స్ వచ్చింది. పరిచయాలు పెరుగుతాయని కాదనకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. రచయితగానూ పనిచేశా. డైరెక్టర్ అవ్వాలనే కోరికను నెరవేర్చుకోవడానికి సాఫ్ట్‌వేర్ జాబ్ ను సైతం వదిలేశాను. తరువాత ‘జబర్దస్త్’ షోలో టీమ్ లీడర్‌గా ఎదిగాను. ఇక్కడే నాకు మంచి రచయితగా, నటుడిగా పేరు వచ్చింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
‘ఏదో ఒక పని చేయించుకోవాలి’ ఉద్దేశంతో ఒకరితో చనువుగా ఉన్నట్టు నటించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. భజన చేయడం నాకు అస్సలు నచ్చదు. కాస్త ఆలస్యమైనా నిజాయతీగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటాను. నా పద్ధతిలో నాకు లభించే విజయమే అసలైన ఆనందాన్ని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ఇతను ‘బాహుబలి 2 ‘(Baahubali 2) సినిమాకు గాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు అభి.