మ్యాన్లీ హీరో జగపతి బాబు గతంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.’శోభన్ బాబు తర్వాత శోభన్ బాబు’ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. గతంలో నిర్మాతలు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు నష్టాలను మిగిలిస్తే.. తర్వాత జగపతి బాబుతో సినిమాలు చేసేవారు. అవి ఆ నష్టాలను తీర్చడమే కాకుండా నిర్మాతలకు లాభాలు కూడా తెచ్చిపెట్టేవి. అప్పట్లో దర్శకనిర్మాతలకు బంగారు బాతులా ఉండేవాడు మన జగ్గూభాయ్. అయితే తర్వాత అతనికి వరుస ప్లాపులు ఎదురయ్యాయి.
యంగ్ హీరోలు, స్టార్ హీరోల ధాటికి ఇతను నిలబడలేకపోయాడు. ఇతని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్లిపోతున్నాయో కూడా తెలీని పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆర్థికంగా కూడా జగపతి బాబు చాలా నష్టపోయాడు. అయితే ‘లెజెండ్’ చిత్రం ఇతనికి మళ్ళీ లైఫ్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ కు సూపర్ ఓపెనింగ్ ను ఇచ్చింది. అక్కడి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీ అయిపోయాడు. తాజాగా ఇతను కీలక పాత్ర పోషించిన ‘పరంపర సీజన్ 2’ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
దీని ప్రమోషన్లో భాగంగా పాలిటిక్స్ గురించి జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘సినిమా ఒక మాయ.. పాలిటిక్స్ ఓ మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, ఓపిక అంతకన్నా లేదు. కాబట్టి రాజకీయాల గురించి నేను ఆలోచించడం లేదు. నలుగురితో మాట్లాడే తెలివే లేదు. అలాంటిది రాజకీయాల్లో జాయిన్ అయ్యి ముందుకెళ్లడం కష్టం. నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల గురించి నాకున్న అవగాహన గుండు సున్నా.
కాబట్టి పాలిటిక్స్‌లో నేను ఎంట్రీ ఇవ్వడం, నేను ఓ పార్టీ పెట్టడం అనేది ఎప్పటికీ జరగని పని’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు. అయితే ‘పాలిటిక్స్ లో రాణిస్తున్న వారిలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మా సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు’ అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చాడు.