దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జన నాయగన్ సినిమా విడుదలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. జనవరి 9న ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనిపై కోర్టులో గొడవ జరుగుతోంది. హెచ్ వినోత్ తీసిన ఈ మూవీ విజయ్ కెరీర్ లో లాస్ట్ ఫిలిం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల ఇంకా క్లియరెన్స్ రాలేదు.
ఈ విషయంలో చిత్ర యూనిట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సమయంలో జస్టిస్ ఆశా జె సెన్సార్ బోర్డు తీరుపై సీరియస్ అయ్యారు. రిలీజ్ టైమ్ లో ఇలాంటి ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. సినిమా విడుదల కావాల్సిన జనవరి 9వ తేదీ ఉదయమే ఫైనల్ తీర్పు ఇస్తామని కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో సినిమా వస్తుందో రాదో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
అసలు గొడవ ఎక్కడ వచ్చిందంటే సెన్సార్ బోర్డులో ఉన్న ఐదుగురు సభ్యుల్లో నలుగురు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఒక్క మెంబర్ మాత్రం కొన్ని సెన్సిటివ్ సీన్లపై అభ్యంతరం చెప్పారు. ఆ ఒక్కరి వల్ల సినిమాను మళ్లీ రివ్యూ కమిటీకి పంపాలని బోర్డు నిర్ణయించడంపై మేకర్స్ కోర్టుకు వెళ్లారు. సెన్సార్ బోర్డు తరఫు లాయర్లు వాదిస్తూ కొత్త కమిటీ సినిమాను చూడటానికి కనీసం 20 రోజులు టైమ్ పడుతుందని చెప్పారు.
అయితే మెజారిటీ సభ్యులు ఓకే అన్నప్పుడు ఇంత లేట్ చేయడం ఏంటని మూవీ టీమ్ వాదించింది. ఆన్ లైన్ లో జరగాల్సిన పనులు సరిగ్గా చేయడం లేదని బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అంతా హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంది. గురువారం ఉదయం కోర్టు ఇచ్చే ఆర్డర్ ని బట్టి విజయ్ సినిమా థియేటర్లకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం పండగ ముందే మొదలైనట్లే. లేదంటే సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది.
