ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సారి ఎలాగైనా తన ప్రభావం చూపించాలని సిద్ధమవుతున్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను జనసేన వెల్లడించింది. అందులో టీవీ స్టార్ నటులతోపాటు, మాజీ క్రికెటర్ పేరు ప్రకటించారు. ఆ లెక్కన ఈటీవీ రియాలిటీ షోల్లో హైపర్ ఆది కొన్ని రోజులు కనిపించకపోవచ్చు.
జనసేన ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో నాగబాబు (Naga Babu) పేరు ఎలాగూ ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) , కమెడియన్ పృథ్వీ(Prudhvi Raj) , టీవీ నటులు సాగర్(Sagar) , హైపర్ ఆది(Hyper Aadi) , గెటప్ శ్రీను (Getup Srinu) పార్టీ కోసం ప్రచారం చేస్తారు. కమెడియన్ హైపర్ ఆది, గెటప్ శ్రీను సందర్భం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై అభిమానం చాటుకుంటుంటారు. పవన్ కల్యాణ్‌కి వీర విధేయులు. హైపర్ ఆది మైక్ పట్టుకుంటే ప్రత్యర్థులపై విమర్శలు పంచ్ డైలాగ్స్ రూపంలో పడుతుంటాయి.
గెటప్ శ్రీను ఎక్కువగా మెగా హీరోల సినిమాల్లో కనిపిస్తుంటాడు. చిరంజీవికి బాగా నచ్చిన లేటెస్ట్ కమెడియన్లలో అతనొకడు. కమెడియన్ పృథ్వీ చాలా కాలంగా జనసేన పార్టీలో ఉన్నారు. జానీ మాస్టర్ పార్టీ కోసం తనదైన శైలిలో ప్రచారం షురూ చేశారు. జనసేన కోసం ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసి పర్ఫార్మ్ కూడా చేశారు. ‘జంగ్ సైరన్’ అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ మధ్య వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు.
‘మొగలిరేకులు’ సీరియల్‌తో పాపులర్ అయిన సాగర్.. ఇటీవల జనసేనలో చేరారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ మధ్య వైఎస్‌ఆర్‌సీపీలో చేరి, కొన్ని రోజులకు రిజైన్ చేసేశారు. ఆ తర్వాత పవన్‌ను కలిసి మాట్లాడారు. నేరుగా పోటీలో లేకపోయినా… ఇప్పుడు ప్రచారకర్తగా నిలిచారు. మరి వీళ్లు ఏ మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారో చూడాలి.