“క్యాస్టింగ్ కౌచ్” అనే అంశం తెలుగుచిత్ర పరిశ్రమలోని నటీమణులను రెండు వర్గాలుగా విడదీసింది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని శ్రీరెడ్డి, మాధవి లతా, ఆమని వంటి వారు నిర్మొహమాటంగా చెబుతుంటే అటువంటిది ఏమీ లేదని హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశర్మ, ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. తాజాగా ఈ విషయంపై అలనాటి నటి జయప్రద స్పందించారు. అడవిరాముడు, అంతులేని కథ, సాగరసంగమం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. బాలీవుడ్ లోను ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న జయప్రదను “మీరు ఎప్పుడైనా అవకాశాల కోసం లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా?” అని ప్రశ్నించగా ఇలా సమాధానమిచ్చారు.
“నాకెప్పుడూ ఆ అనుభవం ఎదురుకాలేదు. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం, నేను నటించిన సినిమాలు అన్నీ విజయవంతం కావడమే దీనికి కారణం” అని వివరించారు. “క్యాస్టింగ్ కౌచ్” సంస్కృతి ఇక్కడ రావడానికి ముంబై స్టార్స్ కారణమని ఆరోపించారు. ” సినీ పరిశ్రమలోకి రావాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంది. ముంబయి నుంచి వస్తోన్న చాలా మంది కొత్తమ్మాయిలు అవకాశాల కోసం దర్శక, నిర్మాతల వద్దకు వెళుతున్నారు. దీంతో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటివారికి తెలిసింది” అని జయప్రద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.