జీవా కెరీర్‌లో ‘రంగం’ ఎంత పెద్ద సినిమానో మనకు తెలిసిందే. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకుని, మంచి నటనను కనబరిచి వావ్ అనిపించుకున్నాడు. అదేంటి… అనుకోకుండా వచ్చిన అవకాశమా? అనుకుంటున్నారా? అవును అలాంటి అవకాశమే మరి. ఆ సినిమాకు దివంగత దర్శకుడు కేవీ ఆనంద్ అనుకున్నది జీవాను కాదు… శింబుని. అర్థమైందిగా మేమెందుకు అలా అన్నామో. శింబుకు సంబంధించి కొన్ని సీన్లు కూడా షూట్ చేశాడు. అయితే ఓ విచిత్రమైన కారణంతో శింబు సినిమా నుండి తప్పుకున్నాడు.
2011లో విడుదలైన ‘రంగం’ (తమిళంలో ‘కో’) కోసం శింబును ఎంచుకున్నాడు దర్శకుడు. ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది అనగా శింబు- హీరోయిన్ కార్తికపై ఫొటోషూట్ కూడా చేశారు. దాంతోపాటు సినిమాలో చూపించే బాంబుదాడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ… శింబు ఈ సినిమాను నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఎందుకా అని ఆరా తీస్తే… హీరోయిన్‌గా కార్తికను పెట్టడం శింబుకు నచ్చలేదట. ‘రంగం’లో కార్తిక బదులు అప్పుడే స్టార్ అవుతున్న తమన్నాను హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని శింబు సూచించాడట.
ఈ విషయంలో డైరక్టర్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ రెండు ఆలోచనలు కుదరక శింబు బయటికొచ్చేశాడట. తమన్నాను సినిమాకు వద్దనుకోవడానికి దర్శకుడి దగ్గర వేరే ఆలోచన ఉందట. ముందుగా అనుకున్నట్లు తమన్నా స్టార్ అవుతున్న రోజులవి. దాంతో ఆమె పారితోషికం భారీగానే డిమాండ్ చేసిందట. బడ్జెట్ అంత లేక దర్శకనిర్మాతలు కార్తిక అయితేనే బెటర్ అనుకున్నారు. దీంతో ఆమె ఉండి.. హీరో వెళ్లిపోయాడు. అలా ‘రంగం’ తొలి హీరో శింబు అయ్యాడు.