నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్న విజయనిర్మలగారు తిరిగిరాని లోకాలకు వెళ్లడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని జీవితా రాజశేఖర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆమె అన్నారు. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో.
విజయ నిర్మలగారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘మీనా’ నాకు చాలా ఇష్టం. అది పక్కన పెడితే… ‘దేవుడే గెలిచాడు’ అని ఒక దెయ్యం సినిమా తీశారు. నా చిన్నప్పుడు వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే, ఆవిడ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. రీసెంట్‌గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. విజయనిర్మలగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇప్పుడు కృష్ణగారి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆవిణ్ణి ఎక్కువగా మిస్ అయ్యేవ్యక్తి ఆయనే. ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఒకరిని మరొకరు వదలకుండా అండర్‌స్టాండింగ్‌తో కృష్ణ, విజయనిర్మల దంపతులు ఉండేవారు. ఇద్దరి దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తి. కృష్ణగారికి, నరేష్ కి భగవంతుడు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా” అని అన్నారు.