నటి శ్రీదేవి మరణం ఎవరూ ఉహించలేదు. ఈ సంఘటన ఆమె కుటుంబసభ్యులను శోక సముద్రంలో ముంచి వేసింది. ఇంకా ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషీలు అమ్మలేకుండా జీవించాల్సిన పరిస్థితిని గుర్తుకు తెచ్చుకొని కుంగిపోతున్నారు. తమకు తామే దైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు (శనివారం) శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తల్లిని, ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జాన్వీ ఓ లేఖను రాసింది. అందులో తల్లి లేని లోటుని శూన్యత తో పోల్చింది. “ఇప్పుడు నా హృదయానికి తగిలిన గాయంతో బతకడం ఎలాగో నేర్చుకోవాలి. నా చుట్టూ ఇంత శూన్యత ఆవరించి ఉన్నా.. ఇంకా నీ ప్రేమను అనుభూతి చెందుతున్నాను. బాధ నుంచి, విచారం నుంచి నన్ను నువ్వు రక్షిస్తున్నట్టు ఫీలవుతున్నాను. కళ్లు మూసుకుంటే నాకన్నీ మంచి విషయాలే గుర్తుకొస్తున్నాయి. దానికి కారణం నువ్వే అని తెలుసు. సాధ్యమైనంత కాలం మా జీవితాల్లో నువ్వు ఉండడం మేం చేసుకున్న అదృష్టం.” అని పేర్కొంది. అమ్మ ఉన్నంతవరకు కూతురికి ఏది సమస్యగా అనిపించదు.
అదే విషయాన్నీ జాన్వీ లేఖలో ప్రస్తావించింది. ” నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటానని నా స్నేహితులు అంటూ ఉంటారు. దానికి కారణం నువ్వేనని నాకిప్పుడు అర్థమవుతోంది. నన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఏదీ పెద్ద సమస్యగా అనిపించలేదు. ఏ రోజూ నిస్తేజంగా లేదు. ఎందుకంటే అప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నేను ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఒకేఒక వ్యక్తివి నువ్వు. నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నా ఆత్మలో భాగం. మా కోసం నీ జీవితాన్ని అర్పించావు. ఇప్పుడు నీ కోసం నేనూ ఆ పని చేస్తా. నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతీ ఉదయం అదే ప్రతిజ్ఞతో నిద్ర లేస్తా. నువ్వు నాలో, ఖుషీలో, నాన్నలో నిండి ఉన్నావు. ఐ లవ్యూ” అంటూ తనలోని భావాలను అమ్మతో చెప్పుకున్నట్టుగా రాసింది. ఈ లేఖను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ లేఖ నేటి అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.